కరీంనగర్ · August 31, 2026

కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరభేరి

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

సెప్టెంబర్ 2 నుండి 8 వరకు హుజూరాబాద్‌ లో వారం రోజుల నిరసనలు

కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్,ఆగస్టు 31: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా ప్రజా సంక్షేమాన్ని విస్మరించి మోసపూరిత పాలన కొనసాగిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు హుజూరాబాద్ నియోజకవర్గవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు “సమరభేరి” నిరసన కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. హుజూరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ పోరాట కార్యాచరణను ప్రకటించారు.ఈ వారం రోజుల నిరసనల్లో భాగంగా సెప్టెంబర్ 2న హుజూరాబాద్ చౌరస్తాలో ‘బాకీల కార్డు’ పంపిణీ, 420 అడుగుల ఫ్లెక్సీతో భారీ ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం సెప్టెంబర్ 3న వీణవంకలో వ్యవసాయ, విద్యుత్, రైతు సంక్షేమ సమస్యలపై నిరసన, సెప్టెంబర్ 4న కమలాపూర్ లో మహాలక్ష్మి సాయం, తులం బంగారం హామీలపై మహిళల ఆధ్వర్యంలో వంటావార్పు, సెప్టెంబర్ 5న జమ్మికుంటలో నిరుద్యోగ నిరసనలు చేపడుతున్నట్లు వివరించారు. సెప్టెంబర్ 6న హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంటలలో స్థానిక సంస్థల నిధుల కొరత, ఆటో కార్మికుల సమస్యలపై ర్యాలీలు నిర్వహిస్తామని, సెప్టెంబర్ 7న ఐదు మండలాల్లో ప్రజావాణి ద్వారా వేలాది వినతులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. చివరిగా సెప్టెంబర్ 8న కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి ఈ సమరభేరిని ముగిస్తామన్నారు. ఈ పోరాటంలో నియోజకవర్గ ప్రజలు, రైతులు, యువత, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ వైఫల్యాలపై నిలదీయాలని పిలుపునిచ్చారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor