కరీంనగర్ · September 2, 2026

కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై హుజూరాబాద్‌లో బీఆర్ఎస్ భారీ నిరసన

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

420 హామీలు – 420 ఫిట్లు.. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాల్సిన బాకీలను వెంటనే చెల్లించాలి!

కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్,సెప్టెంబర్ 02: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు 420 హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రత్యక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళన కార్యక్రమంలో దాదాపు 3,000 మందికి పైగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు , కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిరసన ప్రదర్శనలో భాగంగా “420 హామీలు – 420 ఫిట్లు” అనే నినాదాలతో కూడిన భారీ ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా హోరెత్తించారు. అనంతరం ప్రభుత్వం అమలు చేయకుండా బాకీ పెట్టిన వివిధ సంక్షేమ పథకాల వివరాలతో కూడిన **“కాంగ్రెస్ బాకీ కార్డు”**ను స్థానిక ప్రజలకు, వ్యాపారులకు పంపిణీ చేస్తూ ప్రభుత్వం చేస్తున్న మోసాలపై విస్తృత ప్రచారం నిర్వహించారు.

“దేవుళ్ల సాక్షిగా ప్రమాణాలు చేసి అధికారంలోకి వచ్చాక ప్రజలను నిలువునా ముంచిన కాంగ్రెస్!”

ఈ సభలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రసంగిస్తూ కాంగ్రెస్ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలు, స్థానిక నాయకులు దేవాలయాల్లో దేవుడి సాక్షిగా ప్రమాణాలు చేసి ప్రజలకు గ్యారెంటీ కార్డులు పంపిణీ చేశారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను నెరవేరుస్తామని నమ్మబలికి, నేడు దాదాపు వెయ్యి రోజులు గడిచినా ఏ ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. “వచ్చే నెల.. వంద రోజులు” అంటూ మాటలు దాటవేస్తూ ప్రజలను తీవ్ర మోసానికి గురిచేశారని ఆరోపించారు.


మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు అందించాల్సిన ₹2,500 ఆర్థిక సాయం, కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం, చదువుకునే విద్యార్థినులకు ఉచిత స్కూటీల పంపిణీని ప్రభుత్వం పూర్తిగా పక్కనబెట్టిందని మండిపడ్డారు. అదేవిధంగా రైతులకు రైతు భరోసా కింద ఎకరాకు ఇవ్వాల్సిన సాయం, ఏకకాలంలో ₹2 లక్షల రుణమాఫీ, వడ్లకు క్వింటాలుకు ₹500 బోనస్ చెల్లింపుల్లో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తోందన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెంచిన పింఛన్లను అందించకపోవడం, యువతకు నిరుద్యోగ భృతి, విద్యా భరోసా కార్డులు , ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను విస్మరించడం ద్వారా సమాజంలోని అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు.

“ప్రజల తరఫున రాజీలేని పోరాటం.. హామీలు నెరవేర్చే వరకు ఉద్యమం ఆగేది లేదు!”

రైతులు, మహిళలు, యువత, విద్యార్థులను నిరాశపరిచిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని, ప్రభుత్వం ప్రజలకు బాకీ ఉన్న ప్రతి పైసాను, ప్రతి హామీని నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి రాజీలేని పోరాటం చేస్తుందని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ వైఫల్యాలను నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ తీసుకెళ్లేందుకు ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


ఈ భారీ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బండ శ్రీనివాస్, వాల బాలకిషన్ రావు, పోల్నేని సత్యనారాయణ రావు, నైనేని తిరుపతిరావు, పింగిలి రమేష్ పాల్గొనగా, వీణవంక మండలం నుంచి ముసిపట్ల తిరుపతి రెడ్డి, నీల కుమారస్వామి, దాసరపు రాధాకృష్ణ, కాసర్ల సుధాకర్, ఇల్లందకుంట మండలం నుంచి సరిగొమ్ముల వెంకటేష్, కందాల కొమురెల్లి, మర్రి శ్రీనివాస్ రెడ్డి, కమలాపూర్ మండలం నుంచి పేరాల సంపత్ రావు, యర్రం ఇంద్రసేన రెడ్డి, హుజూరాబాద్ మండలం నుంచి ఏడవెల్లి కొండల్ రెడ్డి, పోల్సాని రామారావు, జమ్మికుంట మండలం నుంచి దొడ్డె మమత, పోల్సాని మనోహర్ రావుతో పాటు హుజూరాబాద్, జమ్మికుంట పురపాలక సంఘాల ప్రజాప్రతినిధులు గందే శ్రీనివాస్, వర్దినేని రవీందర్ రావు, ములుగు ప్రశాంత్ కుమార్, తక్కల్లపల్లి రాజేశ్వర్ రావు , ఐదు మండలాల మున్సిపాలిటీల బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor