కరీంనగర్/హుజూరాబాద్,వి90 న్యూస్, సెప్టెంబర్ 25: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నియోజకవర్గ ప్రజల సమస్యలను గాలికి వదిలేసి దేవుడి పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హుజూరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధికార ప్రతినిధి నేరెళ్ల మహేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు.గణేష్ నిమజ్జనం జరిగిన తీరు బాధాకరమని మాట్లాడే ముందు, గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఇలాగే జరిగిందనే విషయాన్ని కౌశిక్ రెడ్డి గుర్తుంచుకోవాలని హితవు పలికారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో నియోజకవర్గానికి కెసిఆర్, కేటీఆర్‌లకు కౌశిక్ రెడ్డి కేవలం పాలేరులా వ్యవహరించారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల మనోభావాలను అర్థం చేసుకుంటుందని, అందుకే నిమజ్జనానికి నీరు లేకపోయినా ముందస్తుగా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టిందని తెలిపారు. గతానికంటే మిన్నగా, ఎంతో గొప్పగా గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించిన ఘనత మహిళా మున్సిపల్ చైర్మన్‌కే దక్కుతుందని, ఈ విషయం పట్టణ ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు.గణేష్ ఉత్సవాల వేళ మండపాల నిర్వాహకులు చందాలు అడుగుతారనే భయంతో నియోజకవర్గానికి రాకుండా తప్పించుకు తిరిగిన కౌశిక్ రెడ్డి, ఇప్పుడు వినాయక నిమజ్జనంపై మాట్లాడటం సిగ్గుచేటన్నారు. అసలు నియోజకవర్గంలో ఒక్క వినాయకుడిని అయినా ఆయన దర్శించుకున్నారా అని ప్రశ్నించారు. ఎథిక్స్ కమిటీ ముందు తన ఎమ్మెల్యే సభ్యత్వం ఊడుతుందనే భయంతోనే కౌశిక్ రెడ్డి కడుపు రగులుతోందని, ఆ భయంతోనే ఇలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇన్చార్జి వొడితల ప్రణవ్ చేసిన అభివృద్ధి పనులను తానే చేసినట్లు చెప్పుకోవడం ఆయనకే చెల్లిందన్నారు. అసందర్భంగా ఓట్ల కోసం భక్తిని, దేవుణ్ణి అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం సరైన పద్ధతి కాదని, ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు.ఈ విలేకరుల సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్, పట్టణ అధ్యక్షుడు తిరుపతి, జిల్లా చేనేత సెల్ అధ్యక్షుడు సదానందం, మహిళా అధ్యక్షురాలు పుల్ల రాధ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాజీపేట శ్రీనివాస్, మొలుగు రాధ, మైనారిటీ నాయకులు ఇమ్రాన్, సేవాదళ్ అధ్యక్షుడు వినోద్ తదితరులు పాల్గొన్నారు.

