వరంగల్,వి90 న్యూస్,సెప్టెంబర్ 23: వాతావరణ శాఖ వరంగల్ జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన నేపథ్యంలో, విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు , అంగన్‌వాడీ కేంద్రాలకు రేపు గురువారం సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాల తీవ్రత ఎక్కువగా ఉన్నందున విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని ఆమె సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. జిల్లాలోని వర్ష పరిస్థితులను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఏవైనా అత్యవసర పరిస్థితులు లేదా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ఫిర్యాదు చేసేందుకు జిల్లా కలెక్టరేట్‌లో 24 గంటలు అందుబాటులో ఉండే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు సాయం కోసం 18004253424 లేదా 9154252936 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు.

