కరీంనగర్ · November 22, 2026

కౌశిక్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా.. ఆధారాలు చూపించాం: కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ వొడితల ప్రణవ్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/హుజూరాబాద్/వి90 న్యూస్/నవంబర్ 22: సంక్షేమ పథకాల అమలుపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలను హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ వొడితల ప్రణవ్ ఆధారాలతో సహా ఖండించారు. ఆదివారం హుజూరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రణవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో కొత్తగా 4,221 పెన్షన్లను మంజూరు చేసినట్లు వెల్లడించారు.

ఇందులో భాగంగా కౌశిక్ రెడ్డి సొంత గ్రామమైన వీణవంకలోనే 28 కొత్త పెన్షన్లు ఇచ్చామని లబ్ధిదారుల సమక్షంలో వివరాలు బయటపెట్టారు. నియోజకవర్గ వ్యాప్తంగా వితంతువులకు 1,980, దివ్యాంగులకు 1,133, గీత కార్మికులకు 553, చేనేత కార్మికులకు 145, ఒంటరి మహిళలకు 311 పెన్షన్లు అందజేశామని, స్వయంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డే వీటిని పంపిణీ చేసి ఇప్పుడు ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదని మాట్లాడటం సరికాదని ఆయన విమర్శించారు.చనిపోయిన వారికి కూడా పెన్షన్ ఇవ్వాలా అని ప్రణవ్ ప్రశ్నించారు. మేడ్చల్ నియోజకవర్గానికి 6 వేల కొత్త పెన్షన్లు మంజూరయ్యాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్వయంగా వెల్లడించిన వీడియోను ఈ సందర్భంగా ఆయన మీడియాకు చూపించారు.

కనీసం మల్లారెడ్డి మాటలు విని అయినా వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు.ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని, వీణవంక మండలంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహ ప్రవేశాలకు కౌశిక్ రెడ్డే స్వయంగా హాజరయ్యారని ప్రణవ్ గుర్తు చేశారు. అలాగే, నియోజకవర్గంలోని 33,158 మంది రైతులకు రూ. 248.5 కోట్ల మేర రుణమాఫీ జరిగిందని తెలిపారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతుంటే బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని, గ్యాస్, నిత్యావసర ధరల పెరుగుదల ఎవరి పరిధిలో ఉంటుందో కూడా తెలియకుండా ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని ప్రణవ్ ఆరోపించారు. జడ్పీటీసీ స్థాయి నుండి స్వయం కృషితో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన రేవంత్ రెడ్డితో పోల్చుకునే స్థాయి బీఆర్ఎస్ నాయకులకు లేదని ప్రణవ్ అన్నారు.

2009లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కొడంగల్ నియోజకవర్గంలో ఐటీఐ కాలేజీ, కోస్గి బస్ డిపో వంటి అభివృద్ధి పనులు రేవంత్ రెడ్డి చేయించారని, అదే సమయంలో సిరిసిల్ల ప్రాంతానికి కేటీఆర్ ఏం చేశారో కౌశిక్ రెడ్డి చెప్పాలని సవాల్ విసిరారు. పెన్షన్ల విషయంలో ఆధారాలు చూపిస్తే రాజీనామా చేస్తానని గతంలో కౌశిక్ రెడ్డి అన్నారని, ఇప్పుడు ఆధారాలు బయటపెట్టినందున ఆయన వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలకు అంబేద్కర్ చౌరస్తాలో క్షమాపణ చెప్పాలని వొడితల ప్రణవ్ డిమాండ్ చేశారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor