డిసెంబర్ 2, 3 తేదీల్లో జమ్మికుంటలో మహాసభలు..
కరపత్రాన్ని ఆవిష్కరించిన జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్
కరీంనగర్/జమ్మికుంట/వి90 న్యూస్/నవంబర్ 20: భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) కరీంనగర్ జిల్లా 19వ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ పిలుపునిచ్చారు. డిసెంబర్ 2, 3 తేదీల్లో జమ్మికుంట మండల కేంద్రంలో నిర్వహించనున్న ఈ మహాసభలకు సంబంధించిన కరపత్రాన్ని శుక్రవారం స్థానిక వొకేషనల్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ జమ్మికుంట మండల కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. జమ్మికుంట మండల కేంద్రంలో తొలిసారిగా జరగనున్న ఈ మహాసభలకు విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ, విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించి ఎన్నో విజయాలు సాధించిన ఘనత ఎస్ఎఫ్ఐకి ఉందన్నారు. విద్యార్థుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణకు జమ్మికుంట మహాసభలు వేదిక కాబోతున్నాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యారంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని, రాష్ట్రానికి పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రి లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పేరుకుపోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని, కొత్త విధానాల పేరుతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో జిల్లా మహాసభల్లో విద్యారంగ సమస్యలపై సమగ్రంగా చర్చించి, వాటి పరిష్కారం కోసం భవిష్యత్తు పోరాటాలకు రూపకల్పన చేయనున్నట్లు శ్రీకాంత్ వెల్లడించారు. కావున విద్యార్థులు, ప్రజాస్వామికవాదులు ఈ మహాసభలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జమ్మికుంట మండల అధ్యక్ష, కార్యదర్శులు సిద్ధిక్, అనిల్, నాయకులు మహేష్, అక్షయ్, అలీ, మహేందర్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

