హైదరాబాద్/వి90న్యూస్/నవంబర్ 19: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మద్దతుగా నిలవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోరారు. నిర్దేశించిన లక్ష్యాల సాధనలో దేశ ప్రగతికి తనవంతు కర్తవ్యంగా తెలంగాణ కూడా పూర్తి తోడ్పాటును అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్ హైటెక్స్‌లో నిర్వహించిన 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ వార్షిక సదస్సును ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. దేశ భద్రత, జాతీయ ప్రాధాన్యతలు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సంక్షేమం వంటి విషయాల్లో రాజకీయాలకు తావు లేకుండా ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాలను ఎన్నికల వరకే పరిమితం చేసి, మిగిలిన సమయం దేశాభివృద్ధిపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. తెలంగాణలో చేపట్టాల్సిన రోడ్ నెట్‌వర్క్ ప్రతిపాదనలను ఇప్పటికే అనేక సందర్భాల్లో అందించామని గుర్తుచేస్తూ, వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి గడ్కరీకి విజ్ఞప్తి చేశారు.

వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్నామని సీఎం తెలిపారు. ఇందుకోసం రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి, ఔటర్ రింగ్ రోడ్డు లోపలి భాగాన్ని సర్వీస్ సెక్టార్‌గా, ఓఆర్ఆర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతాన్ని తయారీ రంగంగా, ఆర్ఆర్ఆర్ నుంచి రాష్ట్ర సరిహద్దు వరకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల జోన్‌గా అభివృద్ధి చేస్తున్నామన్నారు.

ఈ రంగాల వృద్ధికి నగరాలు, గ్రామాలు, పారిశ్రామిక కారిడార్లను అనుసంధానిస్తూ పటిష్టమైన రోడ్ నెట్‌వర్క్ నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.రోడ్లతో పాటు హెల్త్‌కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లోనూ కీలక చర్యలు చేపట్టామని, ఉస్మానియా ఆస్పత్రి నూతన నిర్మాణం, టిమ్స్ ఆస్పత్రులు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో కలిపి మొత్తంగా 8 వేల పడకల సామర్థ్యంతో ఆస్పత్రులను నిర్మిస్తున్నామని వివరించారు.

85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్‌కు హైదరాబాద్ వేదిక కావడం గర్వకారణమన్న సీఎం, డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భాగస్వాములు కావాలని ప్రతినిధులను ఆహ్వానించారు.ఈ సదస్సులో రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఐఆర్‌సీ అధ్యక్షుడు లక్ష్మి కాంత పది, కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు, నిపుణులు పాల్గొన్నారు.

