నమోదు ప్రక్రియను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్, కమిషనర్ గుట్టల మల్లికార్జున
స్వామితొలిరోజే 424 కుటుంబాల నమోదు
కరీంనగర్/జమ్మికుంట/వి90 న్యూస్/నవంబర్ 20: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని పట్టణంలోని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్), కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక పాత మున్సిపల్ కార్యాలయంలో వారు ఈ బీమా నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లోనూ ఈ ప్రక్రియ కొనసాగగా, మొదటి రోజే ఏకంగా 424 కుటుంబాలు తమ వివరాలను నమోదు చేసుకోవడం విశేషం.

ఈ సందర్భంగా చైర్మన్, కమిషనర్ మాట్లాడుతూ, కుటుంబ పెద్దకు అనుకోని ప్రమాదం లేదా ఇతర కారణాల వల్ల ప్రాణనష్టం జరిగితే ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. ప్రజల భద్రత, ఆర్థిక స్థిరత్వానికి పెద్దపీట వేసిన రాష్ట్ర ప్రభుత్వానికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వం నిర్దేశించిన 30 రోజుల గడువులోపు ఈ ప్రక్రియను వంద శాతం పూర్తి చేసేందుకు కౌన్సిలర్లు, వార్డు అధికారులు, సీఎల్ఆర్పీలు, ఆర్పీలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అధికారులు ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని, అవసరమైన చోట ప్రత్యేక నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసి అర్హులైన ఏ ఒక్క కుటుంబం మిగిలిపోకుండా చూడాలని ఆదేశించారు. ఆసక్తి గల కుటుంబాలు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్‌తో వచ్చి ఆన్లైన్లో పేరు నమోదు చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి. రాజిరెడ్డి, సీనియర్ అసిస్టెంట్లు భాస్కర్, శ్రీనివాస్, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

