ములుగు/మేడారం/వి90 న్యూస్/నవంబర్ 22: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటాలు సాగించిన ఉద్యమకారుల హక్కుల సాధనకు మరో పోరాటానికి సిద్ధమవుతున్నామని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (TUF) రాష్ట్ర సెక్రటరీ జనరల్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఎక్కటి సంజీవరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం మేడారంలో నిర్వహించిన ‘సమ్మక్క–సారలమ్మ చలో మేడారం’ మహాపాదయాత్ర మరియు రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీల అమలు విషయంలో కేకే కమిటీ కాలయాపన చేస్తోందని ఆయన ఆరోపించారు. రానున్న ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున అభ్యర్థులు పోటీ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే, రాబోయే జీహెచ్ఎంసీ (GHMC), వరంగల్ మున్సిపల్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమకారులకు 20 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో అన్ని పార్టీల ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.తమ డిమాండ్లకు టియూఎఫ్ రాష్ట్ర కమిటీ మద్దతు తెలపడంతో పాటు, రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి ఉద్యమకారులు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో తరలివచ్చి మహాపాదయాత్రను విజయవంతం చేసినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఆరె రమేష్ రెడ్డి, మద్దూరి శంకరయ్య, జమ్మికుంట టౌన్ ప్రెసిడెంట్ నర్ర భూమిరెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్ రాజబాబు, మండల ఉపాధ్యక్షులు రచ్చ గణేష్, మీడియా కన్వీనర్ పాత సత్యం, మాజీ సర్పంచులు కనుమల్ల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

