కరీంనగర్ · September 3, 2026

హుజూరాబాద్ నియోజకవర్గంలో ఘనంగా కాంగ్రెస్ 1000 రోజుల ‘ప్రజాపాలన’ విజయోత్సవాలు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/హుజూరాబాద్,వి90 న్యూస్,సెప్టెంబర్ 03: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు మిన్నంటాయి. పీసీసీ, డీసీసీ, నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ కాంగ్రెస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. స్థానిక నాయకులు బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు.హుజూరాబాద్ పట్టణంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించిన భారీ ప్రదర్శనలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.10 లక్షలకు ఆరోగ్యశ్రీ పెంపు, రైతు రుణమాఫీ, పంట బోనస్, 67 వేల ఉద్యోగాల భర్తీ వంటి అనేక సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మనసు గెలుచుకుందని కొనియాడారు.ఇదే సమయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపై, స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేయలేని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే ఓర్వలేక కౌశిక్ రెడ్డి నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. గడిచిన 1000 రోజుల్లో హుజూరాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే తెచ్చిన నిధులు శూన్యమని, ఆయన నియోజకవర్గ అభివృద్ధి నిరోధకుడిగా మారారని విమర్శించారు.

ఇన్చార్జి వొడితల ప్రణవ్ చొరవతోనే నియోజకవర్గానికి కొత్త నిధులు వస్తున్నాయని, హుజూరాబాద్ అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. జమ్మికుంటలో మండల, పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో కోరపల్లి నుంచి గాంధీ చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించగా, ఇల్లందకుంట , కమలాపూర్ మండల కేంద్రాల్లోనూ కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు వేలాదిగా తరలివచ్చి విజయోత్సవ ర్యాలీలను విజయవంతం చేశారు. ఈ అన్ని కార్యక్రమాల్లోనూ స్థానిక మున్సిపల్ చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లు, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు , పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor