కొడంగల్,వి90 న్యూస్,సెప్టెంబర్ 04: కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండల కేంద్రంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి శుక్రవారం ప్రత్యేకంగా సమీక్షించారు. మద్దూరుకు చేరుకున్న ఆయన ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల , కళాశాల నిర్మాణ పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు. హెలిప్యాడ్ వద్ద జిల్లా కలెక్టర్ ప్రియాంక సీఎంకు ఘన స్వాగతం పలికారు.కళాశాల ప్రాంగణంలో నిర్మాణ పనుల స్థితిగతులను, భవన నమూనాను పరిశీలించిన ముఖ్యమంత్రికి ఈడబ్ల్యూఐడీసీ ఎండీ గణపతిరెడ్డి వివరాలు అందించారు. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో 13,670 చదరపు అడుగుల వైశాల్యంతో మూడు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా కళాశాల పక్కన ఉన్న అదనపు భూమిని సర్వే చేసి, అది పట్టా భూమి అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు చేసి ప్రాంగణాన్ని మరింత విశాలంగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ను ఆదేశించారు.రాబోయే విద్యా సంవత్సరానికి విద్యార్థులకు భవనం అందుబాటులోకి వచ్చేలా వచ్చే మార్చి నాటికి అన్ని పనులను పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. కేవలం భవన నిర్మాణమే కాకుండా నాణ్యమైన తరగతి గదులు, ప్రయోగశాలలు, ఇతర మౌలిక వసతులను సమకూర్చాలని సూచించారు.

అనంతరం చింతల్‌దిన్నె మార్గంలో నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ గురుకుల భవన పనులను కూడా పరిశీలించి, నాణ్యతా ప్రమాణాల్లో ఎలాంటి రాజీ పడకూడదని, జాప్యం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు.ఈ పర్యటనలో సీఎం ప్రధాన కార్యదర్శి శ్రీధర్, తాండూర్ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, కొడంగల్ ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీను సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం పర్యటనతో మద్దూరు ప్రాంతంలో విద్యా రంగానికి సంబంధించిన మౌలిక వసతుల కల్పన వేగవంతం కానుంది.

