కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 06: కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల వైఫల్య పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకత్వం, అధినేత కేసీఆర్, కేటీఆర్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆదేశాల మేరకు జమ్మికుంట పట్టణంలో ఆటో కార్మికులకు మద్దతుగా భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) పాల్గొని ఆటో కార్మికులకు సంపూర్ణ సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడూతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఆటో కార్మికులు, పేదలు, మధ్యతరగతి ప్రజల సమస్యలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారు. నిత్యం రెక్కాడితే గానీ డొక్కాడని ఆటో డ్రైవర్లకు ఆదాయం తగ్గిపోవడంతో ఆటో కిస్తీలు, ఇంటి అద్దెలు, పిల్లల చదువులు , వైద్య ఖర్చులు భరించలేక వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఆటో కార్మికులకు అందించిన సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తుత ప్రభుత్వం వెంటనే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన రూ.12,000 ఆర్థిక సహాయాన్ని వెంటనే విడుదల చేయాలని, సబ్సిడీ రుణాలు మంజూరు చేయడంతో పాటు ఆధునిక ఎలక్ట్రిక్ ఆటోలను అందించి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు. ఇతర అంశాలపై కాకుండా కష్టపడి జీవించే కార్మికులు, చిరు వ్యాపారుల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించాలని, ఆటో కార్మికుల న్యాయమైన పోరాటంలో బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, కౌన్సిలర్లు, పిఎసిఎస్ చైర్మన్ పోనగంటి సంపత్, పొడేటి రామస్వామి, పోల్నేని సత్యనారాయణ రావు, కెడిసిసి వైస్ చైర్మన్ పింగళి రమేష్, స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు, ఆటో యూనియన్ ప్రతినిధులు , కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

