కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్, సెప్టెంబర్ 06: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని శాలపల్లి–ఇందిరానగర్ గ్రామంలో గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం పేద వృద్ధ మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా గ్రామపంచాయతీ గుర్తించిన 40 మంది పేద వృద్ధ మహిళలను ఎంపిక చేసి, ట్రస్ట్ నిర్వాహకులు, ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ గంగిశెట్టి జగదీశ్వర్, స్థానిక సర్పంచ్ కోడిగూటి కిరణ్ ల చేతుల మీదుగా ఈ వస్త్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ కోడిగూటి కిరణ్ మాట్లాడుతూ వృద్ధుల సంక్షేమం, వారి శేష జీవితాన్ని సంతోషంగా గడిపేలా చూడటం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. వృద్ధులకు సమయానికి ఆహారం, అవసరమైన ఆరోగ్య సహాయం అందించడంలో అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఏటా పేదలకు చీరలు పంపిణీ చేస్తూ నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మధురమ్మ ట్రస్ట్ నిర్వాహకులను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.గ్రామంలోని పేద వృద్ధ మహిళలకు ట్రస్ట్ చేసిన ఈ సాయం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. సమాజ హితమే లక్ష్యంగా ట్రస్ట్ అందిస్తున్న సేవలు కొనియాడదగినవని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు సభ్యులు కే. శ్రీధర్ రెడ్డి, జీవన్ లతో పాటు గ్రామ ప్రజలు, ట్రస్ట్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

