కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 07: అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్న బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , ఇతర ఎమ్మెల్యేల అక్రమ అరెస్టులను నిరసిస్తూ జమ్మికుంట పట్టణంలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ఆధ్వర్యంలో భారీ మానవహారం, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ నేతృత్వంలో నిర్వహించిన ఎల్పీ సమావేశ నిర్ణయాల ప్రకారం ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నించేందుకు వెళ్తున్న బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులను ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అని కూడా చూడకుండా పోలీసులు రఫ్ గా ప్రవర్తించడం, కేటీఆర్, హరీష్ రావు, కౌశిక్ రెడ్డి వంటి అగ్రనేతలను ఈడ్చిపారేస్తూ అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రజల పక్షాన గొంతు నొక్కేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్నంత మాత్రాన ప్రజా సమస్యలపై తమ పార్టీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. వెంటనే అక్రమంగా అరెస్టు చేసిన నాయకులందరినీ విడుదల చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, కౌన్సిలర్లు, కేడీసీసీ వైస్ చైర్మన్ పింగళి రమేష్, మాజీ ఎంపీపీ దొడ్డే మమత, మాజీ సర్పంచులు , బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

