కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 07: బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు జమ్మికుంటలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమంలో ఎమ్మార్వో, ఎంపీడీఓ , మున్సిపల్ కమిషనర్‌లకు వినతిపత్రం అందజేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు , హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వారం రోజుల పాటు చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈ వినతిపత్రాలు సమర్పించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. బీఆర్‌ఎస్ మున్సిపల్ పాలకవర్గం, మండల నాయకుల తరఫున అందించిన ఈ వినతులను అధికారులు తక్షణమే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ప్రజా సమస్యలను పరిష్కరించి, హామీలను అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, పలువురు కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

