కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,సెప్టెంబర్ 8: జమ్మికుంట పట్టణంలో త్వరలో ప్రారంభం కానున్న శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం నాయిని చెరువు వద్ద చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్), కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, హుజురాబాద్ ఏసీపీ మాధవి , జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించారు.ఈ సందర్భంగా నాయకులు, అధికారులు మాట్లాడుతూ.. గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా నాయిని చెరువు వద్ద గణేష్ నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విద్యుత్ సౌకర్యాలు, ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు, తాగునీరు, రోడ్ల మరమ్మతులు, లైటింగ్ , ఇతర మౌలిక సదుపాయాలను పక్కాగా సమకూరుస్తున్నట్లు స్పష్టం చేశారు. అదేవిధంగా నిమజ్జనం సజావుగా సాగేందుకు క్రేన్లు, ఈతగాళ్లను సిద్ధంగా ఉంచుతామని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా బందోబస్తు చర్యలు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.

పట్టణ ప్రజలు, ఉత్సవ నిర్వాహకులు గణేష్ మండపాలను నిబంధనల ప్రకారం సురక్షితంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిమజ్జన సమయంలో ప్రభుత్వ అధికారులు మరియు పోలీసు శాఖ జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని, భక్తి శ్రద్ధలతో గణనాథుని పూజించి ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ పరిశీలన కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, గౌరవ కౌన్సిలర్లు, తహసిల్దార్ గడ్డం సుధాకర్, మున్సిపల్ ఏఈ వికాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఇల్లందుల రమేష్, ఆర్‌ఐ శంకర్, విద్యుత్ శాఖ ఏఈ శంకరయ్య, సీఎల్ఐ మునీష్‌తో పాటు వివిధ శాఖల ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

