కరీంనగర్ · September 8, 2026

సుస్థిర ఆర్థిక అభివృద్ధి సాధనలో చిన్న తరహా పరిశ్రమల పాత్ర కీలకం: జాతీయ వెబినార్‌లో వక్తలు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 08: ప్రభుత్వ డిగ్రీ , పీజీ కళాశాల అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘సూక్ష్మ , చిన్న తరహా పరిశ్రమల రంగం – భారతదేశంలో సుస్థిర ఆర్థిక అభివృద్ధి సాధన’ అనే అంశంపై జాతీయ స్థాయి వెబినార్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రమేష్ హాజరై మాట్లాడుతూ.. భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సహజ వనరులను, పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే ఆర్థిక అభివృద్ధిని సాధించాల్సిన ఆవశ్యకత ఉందని ఉద్ఘాటించారు.ఈ వెబినార్‌లో ముఖ్య వక్తగా పాల్గొన్న శాతవాహన యూనివర్సిటీ అర్థశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ కే. శ్రీవాణి మాట్లాడుతూ..

సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల రంగం కేవలం తక్కువ పెట్టుబడితోనే అత్యధిక మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని వివరించారు. స్థానిక వనరులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ ప్రాంతీయ అసమానతలు లేని సంతులిత అభివృద్ధికి ఈ రంగం ఎంతగానో దోహదం చేస్తుందని స్పష్టం చేశారు. మరో వక్త, ఇక్ఫాయ్ (ICFAI) అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ లైలా మెం దాని మాట్లాడుతూ.. దేశ జీడీపీలో చిన్న తరహా పరిశ్రమల వాటా 31 శాతంగా, ఉత్పత్తి రంగంలో 35 శాతంగా, అలాగే ఎగుమతులలో 49 శాతంగా ఉంటూ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయని గణాంకాలను వెల్లడించారు.

అనంతరం ఈ రంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న పలు సమస్యలు, సవాళ్లను విద్యార్థులకు విశ్లేషనాత్మకంగా వివరించారు. అలాగే, సూక్ష్మ , చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి, సుస్థిర ఆర్థిక ప్రగతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలు, తీసుకుంటున్న ప్రోత్సాహక చర్యలను గురించి అవగాహన కల్పించారు. ఈ జాతీయ స్థాయి వెబినార్‌లో కళాశాల అర్థశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ కే. రాజేంద్రం, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్. కుమార్, కళాశాల అధ్యాపక బృందం, ఇతర కళాశాలల ఉపన్యాసకులు, రీసెర్చ్ స్కాలర్లు , పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor