కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్, సెప్టెంబర్ 08: దేవాలయంలాంటి అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ నాయకులు ప్రవర్తించిన తీరు తీవ్ర సిగ్గుచేటని, హుజురాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రాజకీయ జీవితానికి పాడే కట్టే రోజులు దగ్గరపడ్డాయని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ మండిపడ్డారు. మంగళవారం హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

దళిత వర్గానికి చెందిన స్పీకర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో తాతా మధు దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ.. కొడంగల్‌లో కాదని, కౌశిక్ రెడ్డికి దమ్ముంటే హుజురాబాద్‌లోనే రాజీనామా చేసి తిరిగి గెలవాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పోల్చుకునే స్థాయి కౌశిక్ రెడ్డికి లేదని, సోషల్ మీడియాలో రీల్స్ కోసం ఆరాటపడటం తప్ప ప్రజల బాగోగులపై ఆయనకు ఎలాంటి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.

దళిత బంధు పథకాన్ని అడ్డుకుని దళితుల కళ్లల్లో కన్నీళ్లు నింపిన చరిత్ర కౌశిక్ రెడ్డిదేనని, ఎన్నికల ముందు ఓట్ల కోసమే ఆయన కపట ప్రేమ చూపాడని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తాము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దళిత బంధు నిధుల ఫ్రీజింగ్ ఎత్తివేశామని, రూ.50 కోట్లు వెనక్కి వెళ్లాయనడంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. లబ్ధిదారుల అకౌంట్లలోనే నిధులు భద్రంగా ఉన్నాయని భరోసా ఇచ్చారు.మహిళలకు సముచిత స్థానం , గౌరవం ఇచ్చే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని కొనియాడారు. గడిచిన 1000 రోజుల్లో హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రతి గడపకు సంక్షేమాన్ని అందించామని పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, సన్న బియ్యం సరఫరా, 18 వేల కొత్త రేషన్ కార్డులు, 3,500 ఇందిరమ్మ ఇళ్లు, నియోజకవర్గంలో 31,158 మంది రైతులకు రూ.243 కోట్లతో రుణమాఫీ చేశామని, అలాగే 73 వేల మంది రైతులకు రూ.71 కోట్ల రైతు భరోసా అందించామని వివరించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

