కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 14: పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. వర్షపు నీటి ప్రవాహం సజావుగా సాగేందుకు , వరద ముప్పు ఉన్న ప్రాంతాలను గుర్తించేందుకు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) అధికారులతో కలిసి పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. ముఖ్యంగా వరద నీరు ఎక్కువగా నిలిచే అవకాశం ఉన్న హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రధాన కాలువతో పాటు శ్రీరామ హాస్పిటల్ నుండి అంబేద్కర్ కాలనీకి వెళ్లే డ్రెయిన్‌ను, అలాగే రామన్నపల్లి , నాయిని చెరువు ప్రాంతాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రజలారా అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని విజ్ఞప్తి చేశారు. పాతబడిన భవనాలు లేదా ఇళ్లు ఉరుస్తున్న పరిస్థితుల్లో నివాసముంటున్న ప్రజలు ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా ముందస్తుగా మున్సిపల్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా ఆదుకునేందుకు తమ పాలకవర్గం , అధికారులు అనునిత్యం అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు. ఈ తనిఖీ కార్యక్రమంలో కౌన్సిలర్లు పొనగంటి రాము, కొలకాని రాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఇల్లందుల రమేష్, కిరణ్ తదితర అధికారులు , నాయకులు పాల్గొన్నారు.

