హైదరాబాద్,వి90న్యూస్,సెప్టెంబర్ 14: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన అధికారిక నివాసంలో సతీ సమేతంగా, కుటుంబ సభ్యులతో కలిసి బొజ్జ గణపయ్యను భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. విఘ్నాలను తొలగించి విజయాన్ని ప్రసాదించే ఆ విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని ఈ సందర్భంగా ఆయన ప్రార్థించారు. తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండాలని, పాడిపంటలు పుష్కలంగా పండి రైతన్నలందరూ సంతోషంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు.

అలాగే రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని మంత్రి ఆకాంక్షించారు. వర్తమాన ప్రజాపాలన ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధాలు లేకుండా విజయవంతంగా కొనసాగాలని, తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని శ్రీ గణనాథుడిని కోరుకున్నట్లు చెప్పారు. ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకోవాలని కోరుతూ, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠించి పర్యావరణహిత వినాయక చవితిని జరుపుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.

