కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 16: జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని తనుగుల గ్రామంలో భూ వివాదం నేపథ్యంలో చోటుచేసుకున్న బొజ్జపల్లి రాజబాబు హత్య కేసును జమ్మికుంట పోలీసులు 24 గంటల్లోనే అత్యంత చాకచక్యంగా ఛేదించారు. పట్టణ సీఐ రామకృష్ణ నేతృత్వంలో పోలీస్ సిబ్బంది వేగంగా స్పందించి ఈ కేసులోని ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.పోలీసులు తెలిపిన విచారణ వివరాల ప్రకారం, మృతుడు రాజబాబు తన తల్లి లచ్చమ్మ పేరిట ఉన్న భూమిని మొత్తం అమ్మాలని కుటుంబ సభ్యులతో తరచూ గొడవపడుతూ అసభ్యంగా ప్రవర్తించేవాడు. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి ఆ భూమిని మూడు భాగాలుగా విభజించినప్పటికీ, రాజబాబు దానికి అంగీకరించకుండా భూమి మొత్తాన్ని తనకే ఇవ్వాలని పట్టుబట్టాడు. ఈ వివాదాల కారణంగా గత ఎనిమిది నెలలుగా జమ్మికుంటలో అద్దెకు ఉంటున్న లచ్చమ్మ, పది రోజుల క్రితం తనుగులలోని తన కూతురు కవిత ఇంటికి వెళ్లి నివసిస్తోంది.ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం అధికంగా మద్యం సేవించిన రాజబాబు, తనుగులలో ఉన్న తన బావ జూపాక శంకర్ ఇంటికి వెళ్లి అక్కడ ఉన్న తల్లి లచ్చమ్మ, అక్క కవితలతో గొడవకు దిగాడు. వారించేందుకు ప్రయత్నించిన తల్లి వెంట్రుకలు పట్టుకుని లాగడంతో ఘర్షణ తీవ్రమైంది. ఆ సమయంలో అప్పటికే మద్యం సేవించి ఉన్న జూపాక శంకర్ (A-1), చేతి వెంకటేష్ (A-4), జూపాక సతీష్ (A-5), మారపెల్లి రాజయ్య (A-6), తదితరులు కలిసి రాజబాబును పట్టుకుని కొట్టి మంచానికి కాళ్లు, చేతులు కట్టేశారు. అనంతరం జూపాక శంకర్ చున్నీతో రాజబాబు మెడను బిగించి హత్య చేశాడు.హత్య అనంతరం విషయాన్ని దాచిపెట్టేందుకు నిందితులు మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి, అదే రాత్రి సైకిల్‌పై తనుగుల గ్రామ శివారులోని శంకర్ పొలానికి తరలించారు. అక్కడ పార, గడ్డపారలతో గుంత తవ్వి మృతదేహాన్ని పూడ్చిపెట్టి, పైభాగంలో మట్టి , తుమ్మ పొరకలు కప్పి ఆధారాలు లభించకుండా చేశారు. పోలీసులు రంగంలోకి దిగి నిందితులను విచారించి హత్యకు ఉపయోగించిన పార, గడ్డపార, సైకిల్, చున్నీలను స్వాధీనం చేసుకున్నారు. భూ వివాదాలు, కుటుంబ సమస్యల విషయంలో ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా న్యాయస్థానాలు లేదా పోలీసులను ఆశ్రయించాలని ఈ సందర్భంగా జమ్మికుంట పోలీసులు విజ్ఞప్తి చేశారు.

