కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 18: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) లక్ష్యం దెబ్బతింటోంది. ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పాలనలో పారదర్శకత కోసం వచ్చిన ఈ చట్టం కొందరు ముసుగు వీరులకు అక్రమార్జన మార్గంగా మారింది. సామాజిక కార్యకర్తలమని చెప్పుకుంటూ వివిధ వ్యాపార సంస్థలు, భవన నిర్మాతలు, చిరు వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని దందాలకు పాల్పడుతున్నారు. సమాచారం ఇప్పిస్తామంటూ నోటీసులు, దరఖాస్తులతో బెదిరింపులకు గురిచేస్తూ భారీగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ అక్రమ దందా వెనుక ప్రభుత్వ శాఖల్లోని కొందరు అధికారుల పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సామాన్య పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరిగినా లభించని కీలక పత్రాలు, రహస్య సమాచారం ఈ వసూళ్ల రాయుళ్లకు మాత్రం రోజుల వ్యవధిలోనే చేతికి అందుతున్నాయి. అధికారుల లోపాయికారీ ఒప్పందాలు, లోపాలను కప్పిపుచ్చే ప్రయత్నాలే వీరికి అస్త్రాలుగా మారుతున్నాయని స్థానికులు బాహాటంగానే విమర్శిస్తున్నారు.ఈ పరిణామాలతో పరిసర ప్రాంతాల్లోని వ్యాపార వర్గాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. చిన్నపాటి లోపాలను సైతం పెద్దవిగా చూపిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తుండటంతో వ్యాపారాలు ఎలా చేసుకోవాలో తెలియక కలవరపడుతున్నారు. ఆర్టీఐ చట్టాన్ని ఆసరాగా చేసుకుని బెదిరింపులకు దిగుతున్న వారిపై సమగ్ర విచారణ జరిపి, వారికి సహకరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ అక్రమ వసూళ్లకు చరమగీతం పాడాలని ప్రజా పరిరక్షణ కమిటీలు, వ్యాపార సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

