కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 19: జమ్మికుంట మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సర్వసభ్య సమావేశం శనివారం మున్సిపల్ చైర్‌పర్సన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) అధ్యక్షతన నిర్వహించబడింది. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి ఆదేశాల మేరకు సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ అజెండాలోని అంశాలను వినిపించగా, సభ్యులు సమగ్రంగా చర్చించి మూడు ప్రతిపాదనలకు ఏకగ్రీవ ఆమోదం తెలిపారు. సద్దుల బతుకమ్మ, చిన్న బతుకమ్మ, పెద్ద బతుకమ్మ వేడుకల నిర్వహణతో పాటు పట్టణంలోని పలు ప్రాంతాల్లో విస్తృత ఏర్పాట్ల కోసం రూ.25 లక్షల పరిపాలనా, ఆర్థిక అనుమతులు మంజూరు చేశారు. అలాగే గాంధీ జయంతి వేడుకల నిర్వహణ, పూల అలంకరణ, రంగుల వేత కోసం రూ.10,000, సానిటేషన్ విభాగం అవసరాల నిమిత్తం బ్లీచింగ్ పౌడర్, మలాథియన్ ఆయిల్, గడ్డి మందు కొనుగోలు కోసం రూ.2.85 లక్షల వ్యయానికి కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించింది.

సమావేశ ప్రారంభానికి ముందు, ఈనెల 10వ తేదీన అకాల మరణం చెందిన మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్ కొలుగురి సురేష్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ కౌన్సిల్ సభ్యులు, అధికారులు ఒక నిమిషం పాటు మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మహ్మద్ ముంతాజ్ అలీ (జావిద్), మేనేజర్ జి. రాజిరెడ్డి, ఏఈ వికాస్, టీపీఎస్ వి. రమేష్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఐ. రమేష్, ఆర్‌ఐ ఎ. భాస్కర్, కౌన్సిలర్లు , కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

