హైదరాబాద్,వి90న్యూస్,సెప్టెంబర్ 21: బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, విద్యా కార్యక్రమాలపై మినిస్టర్ క్వార్టర్స్‌లో ఉన్నతాధికారులతో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ మహిళలకు అందిస్తున్న ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకం దరఖాస్తు ప్రక్రియ, పథకం అమలు తీరు, బీసీ గురుకులాలు, హాస్టళ్ల పనితీరుతో పాటు విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకానికి ఇప్పటివరకు 4 లక్షల 6 వేల దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలియజేయగా, దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 30 చివరి తేదీ అయినందున అర్హులైన ప్రతి బీసీ మహిళకు ఈ పథకం ప్రయోజనం అందేలా ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు, హాస్టళ్లలో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని, పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని అధికారులకు స్పష్టం చేశారు. పాఠ్యప్రణాళికతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ, గత ఏడాది కంటే ఈసారి మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు. రాష్ట్రంలోని 327 బీసీ గురుకుల పాఠశాలల్లో కేవలం 21 మాత్రమే సొంత భవనాల్లో నడుస్తున్నాయని అధికారులు తెలుపగా, మిగిలిన పాఠశాలలకు స్థల సేకరణ కోసం జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. స్థలం అందుబాటులో ఉన్న చోట భవనాల నిర్మాణానికి నిధులు మంజూరయ్యేలా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో చర్చిస్తానని తెలిపారు. అదేవిధంగా, బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా నైపుణ్యాభివృద్ధి , పోటీ పరీక్షల శిక్షణను మరింత బలోపేతం చేస్తూ బీసీ సంక్షేమ ఫలాలు అర్హులందరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.

