కరీంనగర్/జమ్మికుంట/వి90 న్యూస్/నవంబర్ 27: జమ్మికుంట పట్టణ పరిధిలోని కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలను మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) సందర్శించి, అక్కడి బోధనా తీరుతెన్నులు, మౌలిక వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థిని విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించారు. ఉపాధ్యాయులు పాఠాలు ఎలా చెబుతున్నారు, మధ్యాహ్న భోజనం ఎలా అందుతోంది అనే విషయాలను స్వయంగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

దీనిపై విద్యార్థులు స్పందిస్తూ, ఉపాధ్యాయులు తమకు సులభంగా అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేస్తున్నారని, పాఠశాలలో అందించే మధ్యాహ్న భోజనం కూడా రుచికరంగా, నాణ్యతతో ఉంటుందని చైర్మన్‌కు వివరించారు. విద్యార్థుల సమాధానంతో సంతృప్తి చెందిన చైర్మన్, అనంతరం పాఠశాల హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేశారు.

పాఠశాలలోని విద్యార్థులందరూ ఎలాంటి గైర్హాజరు లేకుండా రోజువారీగా క్రమం తప్పకుండా బడికి వస్తుండటాన్ని గమనించి, ఉపాధ్యాయుల కృషిని అభినందించారు. ప్రభుత్వం అందిస్తున్న విద్యా వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బత్తుల లక్ష్మణ్, పాఠశాల ఉపాధ్యాయ బృందం, తదితరులు పాల్గొన్నారు.

