కరీంనగర్/హుజురాబాద్/వి90 న్యూస్/నవంబర్ 27: గ్రామీణ ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు ప్రతి ఒక్కరికీ నాణ్యమైన పాఠశాల విద్యను అందించే లక్ష్యంతో హుజురాబాద్‌కు తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీజీపీఎస్) మంజూరు చేయించినట్లు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 20 ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించిందని, అందులో భాగంగా హుజురాబాద్‌లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం 9 కోట్ల 97 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. వీటికి తోడుగా హుజురాబాద్ పట్టణ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలకు 40 లక్షలు, మండల పరిధిలోని చెల్పూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలకు 40 లక్షలు, వీణవంక మండలంలోని మోడల్ స్కూలుకు మరో 40 లక్షల రూపాయల చొప్పున అదనపు నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు.

ఈ అదనపు నిధులతో ఆయా పాఠశాలల్లో క్రీడా మైదానాల అభివృద్ధితో పాటు అవసరమైన క్రీడా ఉపకరణాలను సమకూర్చనున్నట్లు వెల్లడించారు. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పూర్తిగా పరిష్కరించి ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దుతామని, విద్యతో పాటు క్రీడలకు ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రోత్సాహాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నతంగా రాణించాలని ప్రణవ్ ఆకాంక్షించారు.

హుజురాబాద్ నియోజకవర్గానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్‌తో పాటు అదనపు నిధులను మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

