కరీంనగర్/జమ్మికుంట/వి90 న్యూస్/నవంబర్ 27: జమ్మికుంట పట్టణంలోని లెదర్ పార్కును ప్రముఖ సామాజికవేత్త సబ్బని వెంకట్ శుక్రవారం సందర్శించి, అక్కడి స్థితిగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా పార్కు వద్దకు చేరుకున్న చర్మకారులు తమ దయనీయ పరిస్థితిని, ఏళ్లుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయనకు వివరించారు. సుమారు 300 మంది చర్మకారులు ప్రభుత్వ ఆధ్వర్యంలో వృత్తిపరమైన శిక్షణ పూర్తి చేసుకుని 25 సంవత్సరాలు గడుస్తున్నా, నేటికీ తమకు ఉపాధి కల్పించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పాతికేళ్ల కాలంలో ఎన్నో ప్రభుత్వాలు మారినా, మంత్రులు, ఎమ్మెల్యేలు మారినా తమను పట్టించుకునే నాధుడే లేకుండా పోయారని వారు కన్నీటి పర్యంతమయ్యారు.

కార్మికుల బాధలను విన్న అనంతరం సబ్బని వెంకట్ మాట్లాడుతూ ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2003లో అప్పటి మంత్రులు ముద్దసాని దామోదర్ రెడ్డి, పెద్దిరెడ్డి చర్మకారులకు శాశ్వత ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో ఈ లెదర్ పార్కుకు శ్రీకారం చుట్టారని ఆయన గుర్తుచేశారు. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన నాయకులకు చిత్తశుద్ధి లేకపోవడంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే వారే కరువయ్యారని, ఇది అత్యంత దురదృష్టకరమని అన్నారు.
లెదర్ పార్కు ఏర్పాటు కోసం 25 ఎకరాల విలువైన భూమిని కేటాయించి, 300 మందికి శిక్షణ ఇచ్చినప్పటికీ, ఆ 300 కుటుంబాలను 25 ఏళ్లుగా గాలికి వదిలేయడం సిగ్గుచేటని సబ్బని వెంకట్ మండిపడ్డారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి లెదర్ పార్కును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. చర్మకారులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగి, వారికి ఉపాధి లభించేంత వరకు తాను వెన్నంటి ఉండి పోరాడుతానని ఆయన కార్మికులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో చర్మకారులు, స్థానికులు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.

