కరీంనగర్,వి90 న్యూస్,సెప్టెంబర్ 21: వినాయక నిమజ్జనానికి సంబంధించి కరీంనగర్ నగర శివారులోని చింతకుంట ఎస్ఆర్‌ఎస్పీ కెనాల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిమజ్జనోత్సవం సజావుగా సాగేందుకు కెనాల్‌లోకి తగినన్ని నీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు, హిందూ సంఘాల ప్రతినిధులు “ఛలో చింతకుంట” పిలుపునిచ్చి నిరసనకు దిగారు. ఈ క్రమంలో నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి వాతావరణం వేడెక్కింది.

చింతకుంట కెనాల్ ప్రాంగణంలో నిరసనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. ప్రశాంతంగా సాగుతున్న నిమజ్జన ఏర్పాట్లకు నీటి కొరత ప్రత్యక్షంగా ఆటంకంగా మారిందని, అధికారులు ముందుగానే నీటిని ఎందుకు విడుదల చేయలేదని ఆందోళనకారులు ప్రశ్నించారు. పరిధి దాటి ప్రవర్తించవద్దని హెచ్చరించిన పోలీసులు, ఆందోళన మరింత ఉధృతం కాకుండా ఉండేందుకు నిరసనకారులను చెదరగొట్టి, లాఠీఛార్జ్ నిర్వహించి పలువురు నాయకులను, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఈ ఘటనపై బీజేపీ శ్రేణులు, హిందూ సంఘాల నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వినాయక నిమజ్జనానికి నీరు అడిగితే పోలీసు బలగాలతో అణచివేయడం సరికాదని మండిపడ్డారు. మరోవైపు, శాంతిభద్రతల పరిరక్షణ , ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నామని, నిమజ్జన ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలు యంత్రాంగం చూసుకుంటుందని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.

