తెలంగాణ · September 22, 2026

గణేశ్‌ నిమజ్జనాలు ప్రశాంతంగా, సురక్షితంగా జరగాలి: అధికారులకు సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేశ్‌ ఆదేశాలు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హైదరాబాద్,వి90న్యూస్,సెప్టెంబర్ 22: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గణేశ్‌ నిమజ్జన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా , సురక్షితంగా పూర్తయ్యేలా అధికారులు అన్ని శాఖల సమన్వయంతో పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేశ్‌ ఆదేశించారు. సైబరాబాద్ కమిషనరేట్ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో ఆయన పోలీస్‌స్టేషన్ల వారీగా ఇప్పటివరకు జరిగిన నిమజ్జనాలు, ఇంకా జరగాల్సిన విగ్రహాల వివరాలు, భద్రతా ఏర్పాట్లు , ట్రాఫిక్ నిర్వహణపై విస్తృతంగా సమీక్షించారు.

నిమజ్జన ప్రక్రియ ముగిసే వరకు అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు , ఉత్సవ కమిటీ నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఈ నిమజ్జన మహోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిమిత్తం ఇతర జిల్లాలు, పోలీసు యూనిట్ల నుంచి రెండు దశల్లో మొత్తం 465 మంది అదనపు పోలీసు బలగాలను రప్పించారు. ఇందులో 5 మంది ఏసీపీలు, 6 మంది సీఐలు, 18 మంది ఎస్‌ఐలు, 99 మంది ఏఎస్‌ఐ/హెచ్‌సీలు, 250 మంది కానిస్టేబుళ్లు, 11 మంది మహిళా కానిస్టేబుళ్లు , 74 మంది హోంగార్డులు ఉన్నారు. జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలతో పాటు పీటీసీ, టీజీపీఏ, మల్టీ-జోన్-2 నుంచి వచ్చిన ఈ బలగాలను ప్రధాన కూడళ్లు, నిమజ్జన మార్గాలు , నిమజ్జన కేంద్రాల వద్ద మోహరించారు.

నిమజ్జన ప్రాంతాల్లో ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని, తోపులాటలు జరగకుండా బారికేడ్ల ఏర్పాటుతో పాటు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సీపీ సూచించారు.ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ స్తంభించకుండా, వాహనాల పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా పోలీసు, ట్రాఫిక్ , జీహెచ్‌ఎంసీ విభాగాలు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని సీపీ పిలుపునిచ్చారు. చిన్న సమస్యలు ఎదురైనా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలన్నారు. నిమజ్జనానికి వచ్చే భక్తులు, ప్రజలు పోలీసుల సూచనలు , ట్రాఫిక్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, నిర్ణీత ప్రదేశాల్లోనే వాహనాలను నిలపాలని ఆయన కోరారు. అత్యవసర సమయాల్లో సమీపంలోని పోలీసు సిబ్బందిని సంప్రదించి, వేడుకలు ప్రశాంతంగా పూర్తయ్యేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీఎంసీ కమిషనర్ సృజన, జాయింట్ సీపీ సన్‌ప్రీత్ సింగ్, డీసీపీలు చింతమనేని శ్రీనివాసరావు, రితిరాజ్, శేషాద్రిని రెడ్డి, అన్నపూర్ణ, కోటిరెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor