కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 26: జమ్మికుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) పాల్గొని విద్యార్థులకు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

చదువుతో పాటు నైతిక విలువలు, సంస్కారం కూడా ఎంతో ముఖ్యమని గుర్తుచేశారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల భవిష్యత్తుకు నాంది లాంటిదని, ఇక్కడ గడిపే సమయం, అలవర్చుకునే పద్ధతులే రాబోయే జీవితాన్ని నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. ఏ ఒక్క నిమిషాన్ని లేదా రోజును వృథా చేయకుండా, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ లక్ష్య సాధన దిశగా కష్టపడాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు అధ్యాపకులు ఎంతో శ్రమిస్తున్నారని, ప్రభుత్వం కూడా మెరుగైన విద్యా సౌకర్యాలను అందిస్తోందని తెలిపారు.

విద్యార్థులు సమయాన్ని సరైన రీతిలో వినియోగించుకుని తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DEO) సత్యనారాయణాంజనేయ, కళాశాల ప్రిన్సిపల్ ఎం. కుమార్, అధ్యాపకులు శశిధర్ శర్మ, సుగుణ, జ్యోత్స్న, దేవకి, తిరుపతి, విశ్వనాథ్ రెడ్డి, మహేష్, ప్రభాకర్, రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

