కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 27: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మలిదశ ఉద్యమంలో ప్రాణాలను, జీవితాలను పణంగా పెట్టి పోరాడిన ఉద్యమకారులకు రాజకీయంగా సముచిత ప్రాధాన్యం కల్పించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర సెక్రెటరీ జనరల్ ఎక్కటీ సంజీవరెడ్డి డిమాండ్ చేశారు. జమ్మికుంటలో నిర్వహించిన సమావేశంలో ఆయన స్వాగత ఉపన్యాసం చేస్తూ, ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి అన్ని రాజకీయ పార్టీలు తమ విధానాల్లో వారికి 20 శాతం రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేలా స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు.తెలంగాణ సాధనలో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడి అవయవాలు కోల్పోయారని, అనేకమంది జైలు పాలయ్యారని సంజీవరెడ్డి గుర్తుచేశారు. రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా వారి త్యాగాలకు తగిన గుర్తింపు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్, వార్డు సభ్యుల స్థాయి నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల వరకు ప్రతి రాజకీయ స్థాయిలో ఉద్యమకారులకు అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత పార్టీలపై ఉందన్నారు.ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలతో పాటు పార్టీల సంస్థాగత కమిటీల్లోనూ ఉద్యమకారులకు స్థానం ఇవ్వాలని సూచించారు. కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా నిరంతరం వారిని భాగస్వాములను చేస్తూ రాజకీయ నిర్ణయాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను, కేసులు ఎదుర్కొన్న వారిని అధికారికంగా గుర్తించి, తెలంగాణ ఉద్యమ చరిత్రలో వారి పాత్రకు సముచిత గౌరవం కల్పించడానికి అన్ని రాజకీయ పార్టీలు ఒకే వేదికపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

