కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 28: దేశ స్వాతంత్ర్యం కోసం స్వచ్ఛందంగా ప్రాణాలను త్యాగం చేసి, యువతలో అపరిమితమైన దేశభక్తి, ధైర్యం, త్యాగ స్ఫూర్తిని నింపిన మహోన్నత విప్లవ వీరుడు షహీద్ భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలను అఖిల భారత యువజన సమాఖ్య(AIYF )కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పోలోజు రంజిత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అన్యాయం, దోపిడీ, అసమానతలకు వ్యతిరేకంగా సాగించిన పోరాటంలో భగత్ సింగ్ చూపిన మార్గం నేటి తరానికి నిరంతరం స్ఫూర్తిదాయకమని నాయకులు కొనియాడారు. ఆయన కలలు కన్న సమసమాజ నిర్మాణం సాకారం కావాలంటే ప్రజాస్వామ్య, లౌకిక, సామాజిక న్యాయ పోరాటాలను నిరంతరం కొనసాగించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ సమసమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మోడం శివకృష్ణ, ఆకినపెళ్లి సందీప్, జెట్టి నరేష్, పెండాల రాజిరెడ్డి, హుజురాబాద్ మండల అధ్యక్షురాలు జెట్టి లావణ్య, చేలుక రజిత, అంబాల హరీష్, సతీష్, రాజయ్య తదితరులు పాల్గొని షహీద్ భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు

