కరీంనగర్ · September 30, 2026

పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడంలో ఉద్యోగుల పాత్ర కీలకం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్,వి90 న్యూస్,సెప్టెంబర్ 30: తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలకు 10.5 లక్షల మంది ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులే సేవలందిస్తున్నారని, కేవలం 3 శాతం మంది ఉద్యోగులు 95 శాతం ప్రజలకు సేవలు అందించడం ఎంతో శ్రమ, నిబద్ధతతో కూడుకున్న పని అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. కరీంనగర్‌లో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC)తో పాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆయన ప్రారంభించారు.

అనంతరం రూ.944 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, జిల్లా అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు.సమస్యలతో ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే నిరుపేదలను కుటుంబ సభ్యులుగా భావించి సేవలందించాలని, కార్యాలయాలు ప్రజల్లో నమ్మకం కలిగించేలా ఉండాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెలా మొదటి తేదీనే వేతనాలు చెల్లిస్తున్నామని, ప్రమోషన్లు, బదిలీలు, పీఆర్సీ వంటి సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు.

సమస్యలను పరిష్కరించుకుంటూనే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఉద్యోగులకు సూచించారు.రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతో అవసరమని, ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, మిగిలిన సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. కరీంనగర్ – హైదరాబాద్ మార్గంలో ప్రతిబంధకంగా మారిన కంటోన్మెంట్ భూముల సమస్యను ప్రధాని, రక్షణ మంత్రుల దృష్టికి తీసుకెళ్లి ఆరు నెలల్లోనే 170 ఎకరాలు సాధించామని వెల్లడించారు.

అక్కడ రూ.5 వేల కోట్లతో చేపట్టే ఎలివేటెడ్ కారిడార్‌ను ఏడాదిలోపు పూర్తి చేస్తామని, రాజకీయ సిద్ధాంతాలు వేరైనా ప్రాంతాభివృద్ధే ధ్యేయంగా ముందుకుసాగుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor