కరీంనగర్ · October 2, 2026

గాంధీజీకి నిజమైన వారసుడు ప్రధాని మోదీయే: జమ్మికుంటలో కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, అక్టోబర్ 02: జీవితాంతం హిందూ సనాతన ధర్మాన్ని విశ్వసిస్తూ, నిత్యం రామ నామాన్ని జపించిన మహాత్మా గాంధీకి నిజమైన వారసులు ప్రధాని నరేంద్ర మోదీ , భారతీయ జనతా పార్టీ మాత్రమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటకు విచ్చేసిన ఆయన, స్థానిక బీజేపీ నేతలతో కలిసి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

శ్రీరాముడు సంపన్నుల దేవుడంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై బండి సంజయ్ మండిపడ్డారు. ఒంటిపై గోచీ తప్ప నూలు పోగు కూడా లేకుండా కటిక నేలపై నిద్రించిన మహాత్మా గాంధీ నిత్యం రామ నామాన్ని జపించారని, మరి గాంధీజీ సంపన్నుడా లేక శ్రీరాముడు కేవలం సంపన్నుల దేవుడా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. గాంధీజీ దృష్టిలో శ్రీరాముడు అంటే సత్యం, ధర్మం, న్యాయం , మానవతా విలువలని, అటువంటి సనాతన ధర్మాన్ని ఆచరించిన మహాత్ముడి పేరును నేటి కాంగ్రెస్ నేతలు స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటూ దిగజారుస్తున్నారని ఆరోపించారు.

గాంధీజీ ఏనాడూ పదవులను కాంక్షించలేదని, కుటుంబ వారసత్వ రాజకీయాలను , అవినీతిని తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తుచేశారు. కానీ నేటి ‘ఇటలీ నేషనల్ కాంగ్రెస్’ మాత్రం డూప్లికేట్ గాంధీ కుటుంబం చేతుల్లో చిక్కుకుని, పూర్తిగా వారసత్వం, అవినీతి, హిందుత్వ ద్వేషంతో నడుస్తోందని ధ్వజమెత్తారు. గాంధీ కలలు కన్న రామరాజ్యం, అట్టడుగు పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించడం, అవినీతి లేని పారదర్శక పాలన , ‘స్వచ్ఛ భారత్’ వంటి ఆశయాలను ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రమే ఆచరణలో చూపిస్తోందని కొనియాడారు. రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడుతు, ఖైరతాబాద్ ఉప ఎన్నికకు ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీయే కారణమని విమర్శించారు. కేవలం ముస్లిం ఓట్లను నమ్ముకుని ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ చూస్తోందని, కానీ ఆ నియోజకవర్గంలో ఉన్న రెండు లక్షలకు పైగా హిందూ ఓటర్లను ఏకం చేసి కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఎన్నికల వేళ మాత్రమే బయటకు వచ్చి, మిగతా సమయంలో ఫాంహౌస్‌కే పరిమితమయ్యే కేసీఆర్ తీరును ప్రజలు గమనించాలని కోరారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పోటీ చేసినా ఆ రెండు పార్టీలను బొందపెట్టి, తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor