కరీంనగర్ · May 29, 2026

మతసామరస్యానికి ప్రతీకగా బిజిగిర్ షరీఫ్ ఉర్సు: భక్తులతో కిటకిటలాడిన దర్గా, ఘనంగా సందల్ షరీఫ్ ఉత్సవం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,మే 29: మతసామరస్యానికి నిలువెత్తు రూపంగా నిలిచే జమ్మికుంట మండల పరిధిలోని బిజిగిర్ షరీఫ్ గ్రామంలో హజ్రత్ సయ్యద్ ఇంకుషావలి, హజ్రత్ సయ్యద్ అజ్మత్ షావలి, హజ్రత్ సయ్యద్ అక్బర్ షావలి, హజ్రత్ సయ్యద్ ముర్తుజా షావలి రహమతుల్లాఅలై దర్గా ఉర్సు ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటలకు ‘సందల్ షరీఫ్’ (గంధలేపనం) వేడుకను భక్తుల భక్తిపారవశ్యం మధ్య నిర్వహించారు.

మొల్లాపల్లి, పెద్ద బిజిగిర్ షరీఫ్ గ్రామాల నుండి వేలాది మంది భక్తులు ఆనందోత్సాహాల మధ్య మేళతాళాలతో గంధాన్ని దర్గాకు ఊరేగింపుగా తీసుకొచ్చి, అక్కడి పవిత్ర సమాధులకు అలకరించారు. ఈ సందర్భంగా ముస్లిం మత గురువు మౌలానా యాసీన్ ప్రత్యేక ప్రార్థనలు చేయగా, దర్గా ముజావర్లు హైదరాబాద్ నుండి తెచ్చిన ప్రత్యేక చాదర్లను సమర్పించారు. దేశం నలుమూలల నుండి తరలివచ్చిన వేలాది మంది భక్తులు క్యూలైన్లలో నిలబడి దర్గాను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకోవడంతో ప్రాంగణమంతా భక్తిభావం వెల్లివిరిసింది.ఈ ఉత్సవాల సందర్భంగా భక్తుల కోసం కొత్తగూడెం వాస్తవ్యులు కీర్తిశేషులు గాజి గోవర్ధన్ మిత్రబృందం ఆధ్వర్యంలో సుమారు మూడు వేల మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హుజురాబాద్ ఏసీపీ వి. మాధవి, జమ్మికుంట టౌన్ సీఐ ఎస్. రామకృష్ణ గౌడ్ నేతృత్వంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సందల్ షరీఫ్ కార్యక్రమం అత్యంత విజయవంతం కావడంతో దర్గా ముతవల్లి మహమ్మద్ అక్బర్ అలీ, దర్గా కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఇక్బాల్, కార్యవర్గ సభ్యులు ఉత్సవాల విజయవంతానికి సహకరించిన పోలీస్, వైద్య ఆరోగ్య, ఆర్టీసీ, విద్యుత్, వక్ఫ్ బోర్డ్ అధికారులకు, అలాగే ప్రజాప్రతినిధులకు, జర్నలిస్టులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor