జమ్మికుంట పట్టణ అభివృద్ధే లక్ష్యం: వార్డుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 10: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్), మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపాలిటీలో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక–99 రోజుల’ కార్యక్రమంలో భాగంగా బుధవారం 1, 2, 3, 8, 9, 11, 13, 14, 15, 16, 21వ వార్డుల్లో వార్డ్ సభలను నిర్వహించారు.

ఈ సభల్లో చైర్మన్, కమిషనర్ స్వయంగా పాల్గొని, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన అభివృద్ధి, పారిశుధ్య పనులను వేగవంతం చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వార్డుల్లో డ్రైన్ల పూడికతీత, శుభ్రపరిచే పనులు, రుతుపవనాల సన్నద్ధత, తాగునీటి సరఫరా నిర్వహణ, నీటి నిల్వల నివారణ, పారిశుధ్య చర్యలు, రోడ్ల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటు, మొక్కల పెంపకం, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై చర్చించినట్లు వివరించారు. ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని, అలాగే జల్ సంచయ్ – జల్ భాగీదారి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిలో రైన్‌వాటర్ హార్వెస్టింగ్ గుంతలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు.

కాగా, ధర్మారం వార్డు సభలో భాగంగా ప్రజల కోసం ప్రత్యేకంగా ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు ఏ. భాస్కర్, శ్రీనివాస్, ఐ. రమేష్, వార్డు కౌన్సిలర్లు పోలు దివ్య, పోల్నేని శిల్ప, కొలకాని రాజకుమారి, కొలుగూరి సురేష్, పొనగంటి రాము, విష్ణు, ఎగితా సుజాత, మైస శిరీష, పి. మౌనిక, కొలుగూరి సురంజన్, చింతల శ్రీనివాస్, వార్డు అధికారులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

