ఆంధ్ర ప్రదేశ్ · June 17, 2026

చిన్నారి అభిమాని చిరుకోరిక తీర్చిన పవన్ కళ్యాణ్: అరుదైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ నివాసానికి వెళ్లి పరామర్శ

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

వరంగల్/హనుమకొండ,,వి90 న్యూస్,జూన్ 17: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన డి.ఎన్.డి అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైన హనుమకొండ పట్టణంలోని హనుమాన్ నగర్‌కు చెందిన 17 ఏళ్ల యువ అభిమాని నిరంజన్ కోరికను మన్నించి, బుధవారం ఆయన స్వయంగా నిరంజన్ నివాసానికి వెళ్లారు. తన చివరి కోరికగా పవన్ కళ్యాణ్‌ను కలవాలని నిరంజన్ ఆశించగా, తెలంగాణ జనసేన నాయకుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి వెంటనే స్పందించి తరలివచ్చారు.

లేవలేని స్థితిలో ఉన్న అభిమానిని చూసి చలించిపోయిన పవన్ కళ్యాణ్, నిరంజన్ మంచంపైనే కూర్చుని ఆత్మీయంగా హత్తుకున్నారు. నుదిటిపై ముద్దు పెట్టి ఆప్యాయంగా పలకరించగా, ‘చిన్ననాటి నుంచి మీరంటే అభిమానం’ అని నిరంజన్ చెప్పిన మాటలకు ఆయన ఎంతో కదలిపోయారు.ఈ సందర్భంగా నిరంజన్ తల్లిదండ్రులు రాంగోపాల్, మానసలతో మాట్లాడి బాబు ఆరోగ్య పరిస్థితిని, అందిస్తున్న వైద్య విధానాలను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు.

కుటుంబ సభ్యులకు మనో ధైర్యం నింపుతూ వైద్య ఖర్చుల నిమిత్తం రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి తెప్పించిన వస్త్రాన్ని నిరంజన్‌కు కప్పి, తీర్థప్రసాదాలు, కళ్యాణం అక్షతలు ఇచ్చి ఆశీర్వదించారు. నిరంజన్ గతంలో ఆరోగ్యంగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్‌ను అనుకరిస్తూ చేసిన డాన్సుల వీడియోలు, ఫోటోలను ఆయన ఆసక్తిగా తిలకించారు.

అంతా తనను ‘చోటా గబ్బర్ సింగ్’ అని పిలుస్తారని నిరంజన్ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు వివరించాడు.ఆత్మీయ సంభాషణల నడుమ ఒక కుక్క పిల్ల బొమ్మను చూపిస్తూ, కుక్కను పెంచుకోవాలని ఉందని నిరంజన్ కోరగా, తప్పకుండా కొని పంపుతానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అయితే ఇందుకు ఇంటి యజమానుల అనుమతి కావాలని నిరంజన్ తండ్రి తెలపడంతో, పవన్ కళ్యాణ్ స్వయంగా ఇంటి యజమానులను పిలిపించి మాట్లాడారు. అలాగే ఆ కుటుంబ జీవనోపాధి కోసం గతంలో కాకతీయ ఆసుపత్రి క్యాంటీన్‌లో పనిచేసిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, వారికి ఒక నూతన క్యాంటీన్ పెట్టించాలని జనసేన తెలంగాణ రాష్ట్ర నాయకులను ఆదేశించారు.

నిరంజన్ ఆరోగ్యం కోసం వరంగల్ విఖ్యాత భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయిస్తానని, అమ్మవారి వెండి ప్రతిమను పూజ అనంతరం కుటుంబ సభ్యులకు అందజేస్తానని తెలిపారు. నిరంజన్ పరామర్శ ముగిసిన వెంటనే పవన్ కళ్యాణ్ నేరుగా వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయానికి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జనసేన పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ శ్రీ శంకర్ గౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి, పార్టీ నాయకులు రాధారం రాజలింగం, శ్రీ ఆర్ కె సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor