తెలంగాణ · June 25, 2026

ఉద్యోగుల భద్రత ప్రభుత్వ బాధ్యత.. అడగకపోయినా ఉచిత బీమా రక్షణ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హైదరాబాద్,వి90న్యూస్,జూన్ 25: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో నమ్మకం, విశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు వారికి పూర్తి భద్రత కల్పించడమే ప్రజా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన బీమా సౌకర్యాల కల్పన , వివిధ బ్యాంకులతో అవగాహనా ఒప్పందాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రివర్గ సహచరులతో కలిసి పాల్గొన్న ఈ సదస్సులో సీఎం సమక్షంలోనే ఉద్యోగుల బీమా రక్షణకు సంబంధించి 16 ప్రముఖ బ్యాంకులతో రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ సంస్థ లేదా మరేదైనా… ప్రభుత్వ ఉద్యోగులందరికీ సర్కారే యజమాని అని, వారు అడగకపోయినా వారి కుటుంబాలకు భద్రత కల్పించాల్సిన సామాజిక బాధ్యత తమపై ఉందన్నారు. సింగరేణి కార్మికులు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా కోటి రూపాయల ఉచిత ప్రమాద బీమా కల్పించేలా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెచ్చిన ప్రతిపాదనను విజయవంతంగా అమలు చేశామని, అదే స్ఫూర్తితోనే ఇప్పుడు రాష్ట్ర ఉద్యోగులందరికీ ఈ సౌకర్యం కల్పిస్తున్నామని ప్రకటించారు. విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగి కుటుంబం సమాజంలో తల ఎత్తుకుని నిలబడేందుకే ఈ ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు వివరించారు.గత పదేళ్ల పాలనలో ధనిక రాష్ట్రమైన తెలంగాణను రూ. 8.11 లక్షల కోట్ల అప్పుల్లో ముంచి వందేళ్ల విధ్వంసాన్ని సృష్టించారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో ఒకటో తారీఖున జీతాలు ఇవ్వలేని దుస్థితి ఉంటే, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల మొదటి రోజే వేతనాలు చెల్లిస్తోందని గుర్తుచేశారు. గత ప్రభుత్వం రిటైర్మెంట్ వయస్సును 61 ఏళ్లకు పెంచడం వల్ల 2024 నుంచి పదవీ విరమణ బెనిఫిట్స్ భారంగా మారినప్పటికీ, తాము ఉద్యోగులను చిన్నచూపు చూడకుండా నిధులు విడుదల చేస్తున్నామన్నారు.

వంద రోజుల్లో రూ. 6 వేల కోట్ల రిటైర్మెంట్ బకాయిలు చెల్లిస్తామని మాట ఇచ్చి, ఇప్పటికే తొలి విడతగా రూ. 1000 కోట్లు విడుదల చేశామని, పీఆర్సీ విషయంలోనూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత విద్యుత్, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, సన్నబియ్యం పంపిణీ, మహిళా సంఘాల రుణాల వంటి ప్రతి పథకం విజయంలోనూ, ప్రభుత్వ ప్రతిష్టను పెంచడంలోనూ ఉద్యోగులే బ్రాండ్ అంబాసిడర్లు అని కొనియాడారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే తాము 70 వేల ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేశామని, దీనివల్ల ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడినప్పటికీ వెనకడుగు వేయలేదన్నారు.రాష్ట్ర ప్రగతికి అత్యంత కీలకమైన మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు వంటి అభివృద్ధి పనులను కొందరు రాజకీయ స్వార్థంతో కాళ్లల్లో కట్టెలు పెట్టి అడ్డుకోవాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తాను రోజుకు 16 నుండి 18 గంటలు శ్రమిస్తున్నానని, ప్రస్తుతం మెట్రో, మూసీ, భారత్ ఫ్యూచర్ సిటీ, కుల గణన, ఎస్సీ వర్గీకరణ వంటి ప్రణాళికలన్నీ ఒక్కొక్కటిగా కొలిక్కి వస్తున్నాయని తెలిపారు. అక్రమార్కులను కట్టడి చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు ఉద్యోగులు రోజుకు ఒక గంట అదనంగా పనిచేయాలని, పన్నుల ఎగవేతదారులను పట్టుకోవాలని పిలుపునిచ్చారు. పెరిగే ఆదాయాన్ని తిరిగి ఉద్యోగుల అవసరాలకే ఉపయోగిస్తామని, అందరం కలిసికట్టుగా శ్రమించి 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుదామని సీఎం ఆకాంక్షించారు. ఈ మహాత్తర కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహమ్మద్ అజారుద్దీన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, డీజీపీ సీవీ ఆనంద్, పలు బ్యాంకుల ఉన్నతాధికారులు , ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor