రాష్ట్రంలో రూ.13.06 వేల కోట్లతో ‘హామ్’ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం: పైలాన్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నల్గొండ,వి90 న్యూస్,జూన్ 28: తెలంగాణ రాష్ట్రంలో సరికొత్తగా హైబ్రీడ్ యాన్యుటీ మోడల్ (HAM) పద్ధతిలో చేపట్టనున్న రహదారుల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘనంగా శ్రీకారం చుట్టారు. నల్గొండ జిల్లా కనగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక పైలాన్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించి ఈ భారీ ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు.

రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో సుమారు 13.06 వేల కోట్ల రూపాయల భారీ అంచనా వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 34 ప్యాకేజీల కింద 6,092 కిలోమీటర్ల పొడవు గల 441 రహదారులను విస్తరించేందుకు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టారు. పైలాన్ ఆవిష్కరణ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడకు విచ్చేసిన స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ, వారితో కరచాలనం చేస్తూ ముందుకు సాగారు.ఈ ఉన్నత స్థాయి కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , రాష్ట్ర మంత్రులు నల్లమిల్లి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు నల్గొండ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

