రైలు ప్రయాణికులకు అలర్ట్: వాట్సాప్ టికెట్లు, స్క్రీన్‌షాట్లు ఇకపై చెల్లవు.. భారతీయ రైల్వే కీలక ప్రకటన
డిల్లీ,వి90 న్యూస్,జూలై 12: రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. టికెట్ ట్యాంపరింగ్, దుర్వినియోగాన్ని అరికట్టే ఉద్దేశంతో టికెట్ల తనిఖీ నిబంధనలలో రైల్వే శాఖ కీలక మార్పులు చేసింది. ఇకపై ప్రయాణ సమయంలో వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేసిన టికెట్లు లేదా మొబైల్ స్క్రీన్‌షాట్లను చూపిస్తే అవి చెల్లవని స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా ప్రయాణికులు కేవలం స్క్రీన్‌షాట్ లేదా ఫార్వర్డ్ మెసేజ్‌లను మాత్రమే చూపిస్తే, వారిని టికెట్ లేని ప్రయాణికులుగానే పరిగణిస్తామని వెల్లడించింది. అలాంటి వారు ప్రయాణ దూరాన్ని బట్టి కొత్తగా టికెట్ కొనుగోలు చేయడంతో పాటు రైల్వే నిబంధనల ప్రకారం భారీ జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఐఆర్‌సీటీసీ (IRCTC) అధికారిక యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసిన ఒరిజినల్ ఈ-టికెట్, రైల్వే శాఖ నుంచి వచ్చిన అధికారిక కన్ఫర్మేషన్ మెసేజ్ లేదా కౌంటర్‌లో తీసుకున్న ప్రింటెడ్ టికెట్‌ను మాత్రమే చూపించాల్సి ఉంటుంది. వీటితో పాటు ప్రయాణ సమయంలో తప్పనిసరిగా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ వంటి ఏదైనా ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డును ఒరిజినల్ రూపంలో తమ వెంట ఉంచుకోవాలని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు ఈ కొత్త మార్గదర్శకాలను గమనించి రైల్వే సిబ్బందికి సహకరించాలని కోరారు.

