ఆంధ్ర ప్రదేశ్ · July 22, 2026

వాడపల్లిని తిరుమల తరహాలో అభివృద్ధి చేయడానికి కృషి: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

ఆంధ్రప్రదేశ్/కొత్తపేట,వి90 న్యూస్,జూలై 22: వాడపల్లి క్షేత్రాన్ని తిరుమల తరహాలో మరొక టెంపుల్ టౌన్‌గా తీర్చిదిద్దడానికి అన్ని విధాలా కృషి చేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెల్లడించారు. వాడపల్లి ఆలయ అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ నదియా కుమారి, అడిషనల్ ఎస్పీ, దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు , పాలకమండలి సభ్యులతో కలిసి వాడపల్లిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ముందుగా శ్రీనివాసం-1 కాంప్లెక్స్ నిర్మాణం, వకుళమాత అన్నదాన భవన కేంద్రం పనులు, నాలుగు మాడవీధులు, లొల్ల పార్కింగ్ ప్రాంతం , గోదావరి ఘాట్‌లను పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ ఆలయ నాలుగు మాడవీధులను 40 అడుగుల వెడల్పుతో విస్తరించాలని యోచిస్తున్నట్లు తెలిపారు.

దర్శనానికి వచ్చే వృద్ధులు, చంటిపిల్లల తల్లులు, మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తిరుమల మోడల్‌లో కంపార్ట్‌మెంట్లు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. భక్తుల సంఖ్య రోజురోజుకూ విశేషంగా పెరుగుతుండటంతో వారికి అవసరమైన వసతి, కనీస సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఇందులో భాగంగా 54 గదులతో శ్రీనివాసం-1 నిర్మాణంతో పాటు, రూ. 12 కోట్లతో శ్రీనివాసం-2 నిర్మాణానికి టిటిడి నిధులు మంజూరయ్యేలా సీఎం స్వయంగా సిఫార్సు చేశారని వెల్లడించారు.

వకుళమాత అన్నదాన భవన నిర్మాణం నెల రోజుల్లో పూర్తవుతుందని తెలిపారు. అలాగే ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిధులతో ఏటిగట్టు రహదారి పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని, రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రూ. 5 కోట్ల అంచనాతో నూతన ఘాట్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor