విశాఖపట్నం,వి90 న్యూస్,సెప్టెంబర్ 29: విశాఖపట్నం ప్రతిష్ఠాత్మక మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో నగర రవాణా రంగంలో నూతన అధ్యాయం ప్రారంభం కానుంది. ఈ మెట్రో ప్రాజెక్టును మొత్తం 46.23 కిలోమీటర్ల మేర మూడు ప్రధాన కారిడార్లలో, 42 ఆధునిక స్టేషన్లతో అత్యున్నత ప్రమాణాలతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. సుమారు రూ.11,498 కోట్ల భారీ అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ నిర్మాణం ద్వారా నగరంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గడమే కాకుండా రవాణా వ్యవస్థ మరింత వేగవంతం కానుంది. తొలి విడతలో భాగంగా కూర్మన్నపాలెం నుంచి కొమ్మాది వరకు, గురుద్వారా నుంచి పాత పోస్టాఫీసు వరకు తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు మార్గాల్లో మెట్రో రైళ్లను అందుబాటులోకి తేనున్నారు. అంతేకాకుండా భవిష్యత్తు ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ మెట్రో మార్గాన్ని నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు విస్తరించే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

