డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ/కొత్తపేట, వి90 న్యూస్,ఆగస్టు 30: జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా రూ.6.25 కోట్ల కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నిధులతో నిర్మించిన నూతన వకుళమాత అన్నదాన భవనాన్ని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదివారం వైభవంగా ప్రారంభించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈ భవనాన్ని ప్రారంభించి, దాతలను అభినందించారు.ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ వాడపల్లి క్షేత్రానికి రోజురోజుకూ భక్తుల రాక పెరుగుతోందని, వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు.

కేంద్ర పర్యాటక శాఖ పరిధిలోని ‘ప్రసాద్’ (PRASAD) స్కీమ్ ద్వారా ఆలయానికి అదనపు నిధులు తీసుకువచ్చేందుకు కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రారంభించిన అన్నదాన భవనంలో ఒకేసారి 2,500 మంది భక్తులు భోజనం చేసే వీలుందని, ఆధునిక కిచెన్ ద్వారా రోజుకు 40 వేల మందికి ప్రసాదం సిద్ధం చేయవచ్చని చెప్పారు. భక్తుల నమ్మకంతో ఆలయ ఆదాయం గణనీయంగా పెరిగిందని, శనివారం టికెట్ల ఆదాయం రూ.30 లక్షల నుంచి రూ.కోటికి, నెలవారీ హుండీ ఆదాయం రూ.కోటి నుంచి రూ.2 కోట్లకు చేరిందని వెల్లడించారు.ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు వాడపల్లిని పూర్తిస్థాయి టెంపుల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు.

భక్తుల సౌకర్యార్థం రావులపాలెం నుంచి ఏటిగట్టు మీదుగా వాడపల్లి వరకు 6 కిలోమీటర్ల రహదారిని రూ.8 కోట్లతో నిర్మించనున్నట్లు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంజూరు చేసిన రూ.6 కోట్లకు తోడు రూడా, పుష్కర నిధులను కలిపి ఈ పనులను త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. అన్నదాన భవనంలో రూ.1.5 కోట్లతో ఆధునిక వసతులు సమకూర్చిన పశ్చిమగోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌ను ఈ సందర్భంగా నాయకులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు , అధికారులు పాల్గొన్నారు.

