జర్నలిస్టుల హక్కుల కోసం ఢిల్లీలో గళమెత్తిన టీడబ్ల్యూజేఎఫ్: జంతర్ మంతర్ వద్ద తెలంగాణ పాత్రికేయుల ఉధృత ధర్నా
న్యూఢిల్లీ,వి90 న్యూస్,జూలై 27: దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సుదీర్ఘ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం పాత్రికేయులు భారీ నిరసన ధర్నా నిర్వహించారు. ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన “ఛలో పార్లమెంట్” పిలుపు అందుకొని తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వందలాది మంది జర్నలిస్టులు హస్తినకు తరలివచ్చారు. పార్లమెంట్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ ధర్నా వేదిక వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, జర్నలిస్టుల హక్కుల సాధన కోసం పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసన స్వరాల్ని వినిపించారు.టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగిన ఈ మహా ధర్నా కార్యక్రమాన్ని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ నాయకులు, ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ అధ్యక్షుడు మారూఫ్ రజా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ప్రజాస్వామ్య రక్షణకు నిరంతరం శ్రమిస్తున్న జర్నలిస్టుల భద్రత, సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. దేశవ్యాప్త పాత్రికేయ రంగానికి సంబంధించిన కీలక సమస్యలపై తెలంగాణ జర్నలిస్టులు ఢిల్లీ పీఠం వద్దకు వచ్చి ఈ రీతిలో పోరాటం చేయడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. పాత్రికేయుల హక్కులు, భద్రత, సంక్షేమ పరిరక్షణ కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఎల్లప్పుడూ ముందుండి పోరాడటం వారి నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు. ఈ ధర్నాకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు కూడా హాజరై తమ పూర్తి మద్దతును ప్రకటించారు.అనంతరం ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ప్రసంగిస్తూ, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ పోరాటం ఆగేది లేదని స్పష్టం చేశారు. సమాజంలో నిరంతరం వార్తల సేకరణలో నిమగ్నమయ్యే జర్నలిస్టుల కనీస హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. దేశంలోని ప్రతి ఒక్క పాత్రికేయుడి సముచిత హక్కుల సాధన కోసం టీడబ్ల్యూజేఎఫ్ నిరంతరం అగ్రభాగాన నిలిచి పోరాడుతుందని వెల్లడించారు.ఈ ధర్నా సందర్భంగా జర్నలిస్టులు తమ సుదీర్ఘకాల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా కరోనా సమయం నుంచి నిలిపివేసిన జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్‌లను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వయోభారంతో రిటైర్ అయిన జర్నలిస్టుల జీవన భద్రత కోసం జాతీయ పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టాలని, విధుల నిర్వహణలో రక్షణ కల్పించేలా కఠినమైన జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని ఆమోదించాలని కోరారు. దాంతోపాటు జర్నలిజం రంగాన్ని క్రమబద్ధీకరించడానికి నేషనల్ మీడియా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, అలాగే జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై పునఃసమీక్ష (రివ్యూ) పిటిషన్ దాఖలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను భారత ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌లకు అందజేశారు.ఈ నిరసన ధర్నా కార్యక్రమంలో ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఉపాధ్యక్షుడు లియాఖత్, ప్రతినిధి మాన్విక మిశ్రా, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు బండి విజయ్ కుమార్, రాష్ట్ర నాయకులు కుంచం శ్రీనివాస్, కుడుతాడి బాపురావు, కే. రమాదేవి, జగదీశ్వర్, పద్మనాభ రావులతో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధ్యక్ష, కార్యదర్శులు, పెద్ద ఎత్తున జర్నలిస్టు ప్రతినిధులు పాల్గొన్నారు.

