విదేశీ ఉపాధి బాధ్యత టామ్‌కామ్‌దే: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు
హైదరాబాద్,వి90న్యూస్,జూలై 31: విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లే యువతకు అవసరమైన శిక్షణ, ఉద్యోగ మేళాలు, పాస్‌పోర్టుల నిర్వహణతో పాటు ఆయా దేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించే పూర్తి బాధ్యతను టామ్‌కామ్ (TOMCOM) స్వీకరించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విదేశీ మ్యాన్ పవర్ కంపెనీలతో టామ్‌కామ్ నేరుగా ఒప్పందాలు చేసుకోవడం ద్వారా ఏజెంట్ల చేతిలో మోసపోతున్న ఉత్తర తెలంగాణ కార్మికులకు రక్షణ లభిస్తుందని, ఏదైనా ఇబ్బంది ఎదురైతే ప్రభుత్వపరంగా చర్చలు జరిపి న్యాయం చేయడానికి వీలుంటుందని తెలిపారు. విదేశాలకు కార్మికులను పంపే ఏజెంట్ల వివరాలు సేకరించి, ప్రతి ఒక్కరి డేటాను నమోదు చేయడంతో పాటు ఈ వ్యవహారాల పర్యవేక్షణకు మాజీ ఐఎఫ్ఎస్ అధికారిని టామ్‌కామ్ సీఈవోగా నియమిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే విదేశీ ఉద్యోగాలకు వెళ్లే వారికి లైట్, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్‌లోనూ నాణ్యమైన శిక్షణ ఇవ్వాలని సూచించారు.

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో నూతన ఆవిష్కరణల కోసం రీసెర్చ్ సెంటర్‌తో పాటు జర్మన్, జపనీస్, కొరియన్, చైనీస్, రష్యన్ వంటి విదేశీ భాషలను నేర్పించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్థానిక నిపుణులతో పాటు ఆయా దేశాల శిక్షకులతో బోధన అందించాలని, బ్లూ కాలర్ ఉద్యోగాల శిక్షణ పొందే వారికి కూడా ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు ఇచ్చే అంశంపై అధ్యయనం చేయాలని సూచించారు. ప్రభుత్వ ఇంజినీరింగ్, ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులకు పెద్ద కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ సౌకర్యం కల్పించడం ద్వారా వారి నైపుణ్యాలు పెరగడంతో పాటు స్టైఫండ్ అందుతుందని పేర్కొన్నారు. ఏటీసీలలో ఈవీ సర్వీసింగ్, డ్రోన్ టెక్నాలజీ కోర్సులు ప్రవేశపెట్టాలని, ప్రపంచవ్యాప్తంగా నర్సింగ్ సేవలకు ఉన్న విపరీతమైన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని నర్సింగ్ కళాశాలలకు అనుమతులు విస్తృతం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు.

