తెలంగాణ · August 14, 2026

విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అడ్వాన్స్: పూలే దంపతుల విగ్రహావిష్కరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హైదరాబాద్,వి90న్యూస్,ఆగస్టు 14: హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్, హెచ్ఎండీఏ గ్రౌండ్స్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన జ్యోతీరావు పూలే, సావిత్రీబాయి పూలే విగ్రహాలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆవిష్కరించి మహనీయులకు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు తీపి కబురు అందించారు. ఇకపై ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విద్యార్థులు ఎలాంటి నిరీక్షణ చేయాల్సిన అవసరం లేకుండా, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వెంటనే వారి ఖాతాల్లో ముందస్తుగా నిధులు జమ చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.

ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ నూతన విధానాన్ని ప్రక్షాళన చేసి, ప్రతి ఏటా రూ. 2,400 కోట్లను నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని, ఫీజుల నెపంతో ఏ యాజమాన్యం కూడా విద్యార్థుల సర్టిఫికెట్లను ఆపడానికి వీల్లేదని స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు కేవలం సర్టిఫికెట్లకే పరిమితం కాకుండా సాంకేతిక నైపుణ్యాలను (స్కిల్స్) పెంపొందించుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు నాణ్యమైన విద్యతో పాటు ఏటీసీలు, పాలిటెక్నిక్, స్కిల్ యూనివర్సిటీల ద్వారా సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకుంటే అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

అలాగే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా క్రీడలను ప్రోత్సహిస్తున్నామని, రాష్ట్ర , జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కోటి రూపాయల నగదు బహుమతి అందిస్తామని హామీ ఇచ్చారు. కులాల మధ్య అంతరాలను తగ్గించేందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు.మహనీయుల త్యాగాలు , స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించడానికే పూలే దంపతుల విగ్రహాలను ఆవిష్కరించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అజరుద్దీన్, సలహాదారులు కే కేశవ రావు, వీ హనుమంత రావు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor