రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీ: తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు

0
FB_IMG_1786722806852

హైదరాబాద్ ,వి90న్యూస్ ,ఆగస్టు 14: హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రంలోని 3 కోట్ల 42 లక్షల మంది లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని క్యాబినెట్ తీర్మానించింది. అదేవిధంగా, పెట్టుబడులను ఆకర్షించేందుకు డిసెంబర్ 7, 8, 9 తేదీలలో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0’ను నిర్వహించాలని, ఇందులో భాగం‌గా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రణాళికతో పాటు డిఫెన్స్, ఏరోస్పేస్, ఫార్మా రంగాల్లోని అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పాలని నిర్ణయించారు.

వ్యవసాయ రంగానికి సంబంధించి వానాకాలంలో ఏడు రకాల సన్న ధాన్యం సాగును ప్రోత్సహించాలని, యాసంగి ధాన్యం సేకరణలో మిగిలిన 17.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇ-వేలం (e-Auction) ద్వారా క్వింటాలుకు ₹2,389 బేసిక్ ప్రైస్‌తో విక్రయించాలని నిర్ణయించారు. విద్యా రంగంలో సంస్కరణల్లో భాగంగా ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి శాఖ పరిధిలోకి మారుస్తూ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చారు. అంతేకాకుండా ఆదిలాబాద్, నిర్మల్, ముధోల్, బోథ్, సిర్పూర్, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో నూతనంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి ఆమోదం ముద్ర వేశారు.హైదరాబాద్‌లో కాలుష్య నియంత్రణకు రూ. 200 కోట్లతో ‘తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్’ అమలు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ పథకం ద్వారా పాత ఆటోలను ఈవీలుగా మార్చుకునేందుకు లేదా కొత్తవి కొనుగోలు చేసేందుకు అర్హులైన డ్రైవర్లకు రూ. 1.50 లక్షల వరకు సబ్సిడీ అందించనున్నారు. అలాగే, కాలుష్య కారక పరిశ్రమల తరలింపునకు ఉద్దేశించిన ‘HILT’ పాలసీ దరఖాస్తు గడువును అక్టోబర్ 31 వరకు పొడిగించారు. ఇరిగేషన్ పరిధిలో రూ. 2,100 కోట్ల అంచనా వ్యయంతో మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ఫేజ్-II పనులకు, అలాగే గూడెందొడ్డి పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు సామర్థ్యాన్ని 15 టీఎంసీలకు పెంచి సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్‌ నియామకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *