హైదరాబాద్,వి90న్యూస్,ఆగస్టు 30: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణానికి చెందిన 13 ఏళ్ల బాల మేధావి శ్రీ సృష్టి సాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో రూపొందించిన విశిష్ట పరికరాన్ని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆవిష్కరించారు. మొబైల్ కంట్రోల్ , వైఫై ఆధారిత ఫ్లాగ్ హోస్టింగ్ సిస్టమ్‌ను చిన్న వయసులోనే అత్యంత నైపుణ్యంతో తయారు చేసి అద్భుతమైన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టిన సృష్టి సాయిని ఎంపీ ఈటల రాజేందర్ శాలువా కప్పి, జ్ఞాపికను అందించి అత్యంత ఘనంగా సన్మానించారు. చిన్న వయసులోనే ప్రదర్శించిన ఈ అసాధారణ సాంకేతిక పట్టును ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక చిన్నారి అంతర్జాతీయ స్థాయి ఆలోచనలతో ముందుకు రావడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ వేగంగా డిజిటల్ విప్లవం వైపు పయనిస్తోందని పేర్కొన్నారు. ‘డిజిటల్ ఇండియా’ దార్శనికతతో పాటు దేశ యువతలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్ వంటి భవిష్యత్ రంగాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు. మోదీ ప్రోత్సాహంతో భారత్ నేడు కేవలం సాంకేతికతను వినియోగించే దేశంగా మాత్రమే కాకుండా, సరికొత్త టెక్నాలజీలను సృష్టించే గ్లోబల్ హబ్‌గా రూపాంతరం చెందుతోందని చెప్పారు. ఈ తరుణంలో నేటి విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ఎఐ, కోడింగ్ వంటి నూతన సాంకేతిక నైపుణ్యాలను అలవర్చుకుని దేశానికి ఉపయోగపడే కొత్త ఆవిష్కరణలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శ్రీ సృష్టి సాయి నేటి తరం విద్యార్థులందరికీ ఆదర్శంగా నిలిచాడని, భవిష్యత్తులో ఈ చిన్నారి మరిన్ని అద్భుతమైన పరిశోధనలతో దేశానికి, మాతృభూమికి గొప్ప పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

