కామారెడ్డి · April 28, 2026

శిశువుల భద్రత – రక్షణే ప్రభుత్వ లక్ష్యం: కామారెడ్డిలో మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కామారెడ్డి ఏప్రిల్ 28 (V90 NEWS): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో శిశుభద్రత , శిశు రక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమాజంలో వేళ్లూనుకున్న మాదక ద్రవ్యాల మహమ్మారికి యువత దూరంగా ఉండాలని, బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ముఖ్యంగా పిన్న వయసులో గర్భధారణల వల్ల కలిగే అనర్థాలు, ఇంటి నుండి పరారీలో ఉన్న పిల్లల రక్షణ వంటి సున్నితమైన అంశాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించారు. అనంతరం శిశు సంరక్షణ సంస్థలోని పిల్లలకు ధృవపత్రాలను అందజేయడంతో పాటు, చదువుకునే ఆడపిల్లలకు ప్రోత్సాహకంగా సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పిల్లల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, సమాజంలో సానుకూల మార్పు రావాలంటే ప్రతి కుటుంబం బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు అవగాహన కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. బాల్య వివాహాలు, చిన్న వయసు గర్భధారణలను అరికట్టేందుకు కఠిన చట్టాలను అమలు చేస్తున్నామని, వీటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. శిశు సంరక్షణ సంస్థల్లో ఉన్న చిన్నారులకు అన్ని రకాల వసతులు కల్పిస్తూ, వారు ఉన్నత శిఖరాలను అధిరోహించే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అడిషనల్ కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇప్ప ఉమా శ్రీనివాస్, గ్రంధాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్, పలువురు అధికారులు, విద్యార్థులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor