జమ్మికుంటలో ముమ్మరంగా జనగణన శిక్షణ: డిజిటల్ పద్ధతిలో ఇండ్ల నమోదు
జమ్మికుంట ఏప్రిల్ 28 (V90 NEWS): సెన్సెస్ 2027 జనగణనను పురస్కరించుకొని ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న ఈ శిక్షణా శిబిరం వివరాలను మున్సిపల్ మేనేజర్ జి. రాజిరెడ్డి, టిపివో శ్రీధర్ వెల్లడించారు. ఏప్రిల్ 28 నుండి 30 వరకు మొదటి దశ శిక్షణ జరుగుతుందని, అనంతరం మే 2 నుండి 4 వరకు రెండో దశ శిక్షణ ఉంటుందని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా ఈసారి జనాభా గణనను మొట్టమొదటిసారిగా డిజిటల్ విధానంలో చేపడుతున్నామని, ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన హెచ్‌ఎల్‌ఓ యాప్ ద్వారా ఇండ్ల గణన ఏ విధంగా చేయాలో సిబ్బందికి అవగాహన కల్పించారు. యాప్‌లో అడిగే 33 ప్రశ్నలకు సమాధానాలను ఏ విధంగా నమోదు చేయాలనే అంశంపై మాస్టర్ ట్రైనర్లు నాగరాజు, వేణుగోపాల్ క్లుప్తంగా వివరించారు. ఈ శిక్షణలో 42 మంది ఎన్యూమరేటర్లు, ఆరుగురు సూపర్‌వైజర్లతో పాటు టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ రాజ్ కుమార్ , మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
